Gold biscuits : బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India) లోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 1.167 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఉత్తర 24 పరగణాల (North 24 Parganas) జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో హకీంపురాలో 143 బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా భారీగా బంగారం పట్టుబడింది. దాంతో వారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 143, 32 బెటాలియన్లకు చెందిన బీఎస్ఎఫ్ అధికారులు వేర్వేరుగా మొత్తం 41 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. డ్రగ్స్‌ను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు.