హైదరాబాద్, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన గోద్రెజ్ క్యాపిటల్ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నది. బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, గోద్రెజ్ క్యాపిటల్ సీఈవో మనీష్ షాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ-2024లో భాగంగా ఏర్పాటుకానున్న కొత్త పరిశ్రమలకు, ముఖ్యంగా మొదటిసారి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నవారికి రుణ సహాయం అందించడం ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
ఒలెక్ట్రాకు భారీ ఆర్డర్
హైదరాబాద్, ఏప్రిల్ 9: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మరో అతిపెద్ద ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(హెచ్ఆర్టీసీ) నుంచి 297 నాన్-ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ లభించినట్టు పేర్కొంది. ఈ ఆర్డర్ విలువ రూ.427 కోట్లని పేర్కొంది. 30 మంది ప్రయాణీకులు ప్రయాణించే ఈ బస్సు సింగిల్ చార్జింగ్‌తో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కంపెనీకి వచ్చిన అతిపెద్ద ఆర్డర్లలో ఇది కూడా ఒకటని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.