పెనుబల్లి, జూలై 12 : పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ మధ్యతరహా ప్రాజెక్టులోకి సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా గోదావరి జలాలు రావడంతో దాని ఆయకట్టు రైతులు, బీఆర్ఎస్ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బీళ్లుగా ఉన్న పంట పొలాలను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఫలించిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఉక్కు సంకల్పంతో గోదావరిపై సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని, 85 శాతం పూర్తిచేశారని, ఆ ఘనత ముమ్మాటికీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
అందువల్లనే అన్నదాతలు నేడు ఆనందంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు ద్వారా మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం గోదావరి జలాలు చేరడాన్ని హర్షిస్తూ స్థానిక రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆ గోదావరి జలాలను తాకారు. ఆ జలాల్లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి జల, పుష్ప, క్షీర అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాన్ని పండుగ చేశారని గుర్తుచేశారు. కానీ, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనీసం రైతులకు తగినంత యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.