రంగారెడ్డి, జూలై 12 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని అత్యంత విలువైన రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ భూమి హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఈ భూమికి ఇరువైపులా పెద్దపెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌లున్నాయి. అత్యంత విలువైన ఈ భూమి కొంతమంది కబ్జాచేసి ఆక్రమించుకున్నారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. హైదరాబాద్ శివారులల్లో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని భూముల విలువ గణనీయంగా పెరిగింది. రాగన్నగూడతో పాటు తుర్కయాంజాల్, మన్నెగూడ తదతర గ్రామాల్లో విలువైన ప్రభుత్వ భూములు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు గురవుతున్నాయి. ఈ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని స్థానికులు అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేశారు. అయినా అధికారులు భూమి స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడటంతో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని రాగన్నగూడ గ్రామంలో గల సర్వేనంబర్ 41/ 1లో 1.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉం ది. ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని, అలాగే, ఈ భూమి నిషేధిత జాబితా లో ఉన్నందున కొనుగోళ్లు, అమ్మకాలు జరపటాన్ని నిషేధిస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ భూమి ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా.. ఆ భూమి ఇప్పటికే కబ్జా అయినప్పటికీ అధికారులు స్పందించడంలేదు. భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
రాగన్నగూడగ్రామంలోని సర్వేనంబర్ 41లోగల 1.26ఎకరాల ప్రభుత్వ భూమి హైదరాబాద్ నాగార్జునసాగర్ పక్కనే రోడ్డు వెంట ఉంటుంది. ఈ భూమి పూర్తిగా కమర్షియల్ కట్టడాలకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ భూమి చుట్టూ అనేక కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. కమర్షియల్ కాంప్లెక్స్‌ల మధ్యనే ఈ భూమి ఉండటం వల్ల ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.10కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిని ఇప్పటికే కొంతమంది వ్యక్తులు ఆక్రమించి షాపులు నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. ఇటీవల ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా సుమారు 1300గజాల భూమిలో తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చారు. కాగా, ఈ భూమిని రెగ్యులరైజ్ చేసుకోవటానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని స్థానికులు వాపోతున్నారు.
రాగన్నగూడ గ్రామంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీ నం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నా రు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలనికోరుతున్నారు.