సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో కొందరు ఉద్యోగుల తీరుపై విజిలెన్స్ విభాగానికి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లైన్లు, మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు.. ఇలా ఒకటేమిటి సంస్థాగతంగా జరగాల్సిన పనులకు సంబంధించి కొందరు విద్యుత్ సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో వంద వరకు ఫిర్యాదులు వచ్చేవి కాగా ప్రస్తుతం నాలుగువందలకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిసింది.
ఈ క్రమంలో వినియోగదారులు, కాంట్రాక్టర్లు, కొందరు సిబ్బందికూడా వ్యక్తిగత, వ్యవస్థాగతంగా ఫిర్యాదులు చేస్తుండడంతో వాటిపై విచారణ జరిపేందుకు కొంత సమయం తీసుకుంటున్న విజిలెన్స్ అధికారులు ఆ తర్వాత తమ రిపోర్టును సీఎండీకి పంపిస్తున్నారు. ఈ నివేదికను సీఎండీ పరిశీలించి తదుపరి చర్యలకు హెచ్ఆర్డీ విభాగానికి పంపిస్తున్నారు. గతంలో హెచ్ఆర్ విభాగంలో పనిచేసిన అధికారి చేతివాటం ప్రదర్శించి చాలామంది ఉద్యోగుల అక్రమాలకు కొమ్ముకాశారనే ఆరోపణలు వచ్చాయి.
ఒక సర్కిల్లో ఇద్దరు అధికారులపై విజిలెన్స్ విభాగం చర్యలకు సిఫారసు చేయగా అందులో ఒకరిని స్థానికంగా ఒక సెక్షన్ నుంచి మరొక సెక్షన్‌కు బదిలీ చేసి చర్యలంటూ చేతులు దులుపుకోగా మరొక అధికారిని సస్పెండ్ చేశారు. దీనిపై
అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ వ్యవహారంలో రిటైరయిన అధికారి చేసిన గోల్మాల్ను అప్పట్లో మళ్లీ విజిలెన్స్ వారే గుర్తించి బయటపెట్టడంతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నారు.
కీసరలో ఇటీవల స్థానిక అధికారులు చేసిన గోల్మాల్ వ్యవహారం ప్రస్తుతం డిస్కంలో చర్చనీయాంశమైంది. సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న వెంచర్లకు ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండా విద్యుత్ లైన్లు ఇవ్వడం, ఎటువంటి మంజూరీలు లేకుండానే పనులు చేపట్టడంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ అక్రమాలకు బాధ్యులెవరనేది తేల్చే పనిలో విజిలెన్స్ విభాగం కొన్నిరోజులుగా విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ సిబ్బంది దక్షిణ డిస్కం పరిధిలోని 21 సర్కిళ్లలో ఎప్పటికప్పుడు ఈ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు.
మరోవైపు డిస్కంకు సంబంధించిన కొందరు ఉన్నతాధికారులపై కూడా ఫిర్యాదులు వస్తే వాటిపై కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరగడం, సంబంధిత నివేదికలు ఇవ్వడం కామనే అయినా ఇటీవల ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారంలో డిస్కం ఉన్నతాధికారుల తీరుపై అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఆ కీలకమైన వ్యక్తికి సంబంధించి రావలసిన కొన్ని బెనిఫిట్స్‌ను కూడా ఆపేసినట్లు సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేకపోగా హెచ్ఆర్ విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాత్రం ప్రస్తుతం ఆ వ్యక్తిపై విచారణ జరుగుతున్న మాట వాస్తవమేనని ఆఫ్ ది రికార్డుగా చెప్పారు.
ఒకవైపు విజిలెన్స్ విభాగం విచారణ పూర్తి చేసి అందుకు సంబంధించిన నివేదికను సీఎండీకి ఇచ్చిన తర్వాత ఆ ఫైల్‌ను మానవవనరుల విభాగానికి పంపిస్తారు. ఇక్కడే అసలు వ్యవహారం మొదలవుతున్నదని, గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ ఇప్పుడు కూడా చాలామంది అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసినా సంస్థలో అంతర్గత విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారంటూ కొందరు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. సర్కిళ్ల వారీగా కొన్ని ఫోకల్ ప్రాంతాల్లో ఉన్నవారిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నా వాటిపై పెద్దగా చర్యలు తీసుకోవడం లేదంటూ మింట్ కాంపౌండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత నాలుగు నెలలుగా విజిలెన్స్ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఒక ఏఈతో సహా ముగ్గురు సిబ్బందిపై వేటు వేసినట్లు తెలిసింది. సీఎండీ జితేష్ వీ పాటిల్ అవినీతిని సహించకపోగా, సిబ్బంది అక్రమాలపై కొరడా ఝళిపించే పనిలోనే ఉన్నట్లుగా ఈ వేటు చర్యలతో తేటతెల్లమవుతోంది. కానీ డిస్కంలోని ఒకట్రెండు కీలక విభాగాల్లో జరుగుతున్న వ్యవహారం, సంస్థాగతంగా జరిగే విచారణలో ఉన్న కొన్ని లొసుగులు సీఎండీకి తెలియనీయకుండా పైపైనే చిన్నచిన్న క్రమశిక్షణాచర్యలతో సరిపెట్టేలా అక్రమార్కులకు కొందరు కీలక అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.