వరంగల్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గంటగంటకూ గోదావరికి వరద పోటెత్తుతున్నది. గురువారం మేడిగడ్డ బరాజ్‌కు ఈ సీజన్లో 3,31,265 క్యూసెక్కులు, సమ్మక్క బరాజ్ వద్ద 8 లక్షల క్యూసెక్కులను దాటిపోయింది. సమ్మక్క బరాజ్ 59 గేట్లన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నా రు. మేడిగడ్డ బరాజ్‌కు సమ్మక్క బరాజ్‌కు మధ్య దూరం 55 కి.మీలు. ఈ దూరంలో వరద గోదావరి తేడా 6 లక్షల క్యూసెక్కులు. మేడిగడ్డ నుంచి దిగువన 15 కిమీ దూరంలో గోదావరిలో ఇంద్రావతి కలుస్తుండటంతో ఆ తేడా సహజమే అని నీటిపారుదల శాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నదని గోదావరి ఆవలి తీరం(మహారాష్ట్ర)లోని కలెక్టర్లు భారీ వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న కార్యాచరణ స్పష్టంచేస్తున్నది. ఇటువైపు జయశంకర్-భూపాపల్లి, ములుగు జిల్లాలు, మహారాష్ట్ర వైపు నాగ్‌పూర్, గడ్చిరోలి జిల్లాలు.
మేడిగడ్డకు ఎగువన ఉన్న కాళేశ్వరం.. దానికి ఆవలితీరంవైపు ఉన్న గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ, అహేరి, అసరెల్లి ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విద్యుత్తు సరఫరా కు అంతరాయం ఏర్పడి, విద్యాసంస్థలకు 3రోజులు సెలవు ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి వరద గోదావరిలో కలిసినా రాష్ట్ర సర్కార్ మాత్రం మేడిగడ్డ వద్ద గురువారం రాత్రి 7గంటల వరకు చేరిన వరద 3,31, 265 క్యూసెక్కులేనని, సమ్మక్క బరాజ్ వద్ద 8 లక్షల క్యూసెక్కులపైనేనని ప్రకటిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. ఎల్ నినో ప్రభావంతో రైతులు అల్లాడుతున్నారని, గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీరు ఉన్నదని, కన్నెపల్లి పంప్‌ల నుంచి ఎత్తిపోసి ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభు త్వం కావాలనే లెక్కలను గోప్యంగా ఉంచుతున్నదనే అనుమానాలున్నాయి. సమ్మక్క బరా జ్ వద్ద రాత్రి 9 గంటలకు 8,97,920 క్యూసెక్కులు చేరగా, దేవాదుల 9 పంపుల ద్వారా 2,306 క్యూసెక్కులు ఎత్తిపోస్తూ 8,95,614 క్యూసెక్కుల నీటిని సమ్మక్కబరాజ్ 59 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.