హైదరాబాద్ : సంక్రాంతి పండుగ ( Sankranthi festival ) సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు భద్రత చర్యలు తీసుకోవాలని రైల్వే డివిజన్ల మేనేజర్లకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ( Railway GM ) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ (Sanjay Kumar Srivastava ) సూచించారు. రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రత , పండుగ రద్దీని నిర్వహించడంపై కోసం తీసుకోవలసిన చర్యలపై మంగళవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమీక్షాసమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ , వివిధ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు, సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు , నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రాబోయే సంక్రాంతి పండుగ సీజన్‌కు రద్దీ దృష్ట్యా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ప్రయాణికుల రాకపోకలను సాఫీగా సాగించడానికి ఆర్పీఎఫ్, టికెట్ తనిఖీ సిబ్బందితో గ్రౌండ్ ఆపరేషన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా ట్రాక్ నిర్వహణ పనులు, షంటింగ్ కార్యకలాపాల నిర్వహణ సమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. పనులు పూర్తయిన తర్వాత ట్రాక్‌ల దగ్గర ఎటువంటి నిర్మాణ సామగ్రి ఉండకుండా తగుచర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంకా సమీక్షలో పరికరాల నిర్వహణ, క్రమం తప్పకుండా తనిఖీలు , అగ్నిమాపక భద్రతా జాగ్రత్తలను, స్టేషన్లు, గూడ్స్ షెడ్లు , నాన్ ఇంటర్ లాక్డ్ లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు నిర్వహణను సమీక్షించారు.