
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్వదేశ్ దర్శన్ పథకం కింద తెలంగాణ రాష్ర్టానికి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి కిషన్‌రెడ్డి ఈ మేరకు సమాధానమిచ్చారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద రాష్ర్టాల్లో పర్యాటక సదుపాయాల కల్పన, సౌండ్ అండ్ లైట్ షో, అడ్వెంచర్ ఎక్విప్మెంట్, కాన్ఫరెన్స్ హాళ్లు, కోటల పునరుద్ధరణ, మ్యూజియంల ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇస్తున్నట్టు చెప్పిన కిషన్‌రెడ్డి.. తెలంగాణకు మాత్రం కొత్త ప్రాజెక్టులేవీ ఇవ్వబోవడం లేదని తేల్చిచెప్పారు.
కిషన్‌రెడ్డి ప్రకటనతో స్వదేశ్ దర్శన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు బ్రేకులు పడ్డాయి. మహబూబ్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ పిల్గ్రిమ్ అండ్ నేచర్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి రూ.101.73 కోట్లు, మంచిరాల్యలో ఎకో టూరిజం సర్య్యూట్‌కు రూ.98 కోట్లు, రాష్ట్రంలో ఫోర్ట్స్ సర్క్యూట్ అభివృద్ధికి రూ.94.77 కోట్లు, వరంగల్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ పిల్గ్రిమ్ అండ్ నేచర్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి రూ.104.29 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిం ది. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ర్టాల సమావేశంలోనూ పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ర్టానికి చెందిన కిషన్‌రెడ్డి కేంద్రంలో పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, 2015-16లో మహబూబ్‌నగర్ జిల్లాలో ఎకో టూరిజం సర్యూట్‌కు రూ.91.62 కోట్లు మంజూరు చేయగా, రూ.77.45 కోట్లతో పనులు చేసినట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 2016-17లో ములుగు జిల్లాలో ట్రైబల్ సర్క్యూట్ అభివృద్ధికి రూ.79.87 కోట్లు మంజూరు చేయగా రూ.68.9 కోట్లతో పనులు చేసినట్టు వెల్లడించారు. 2017-18లో హెరిటేజ్ సర్క్యూట్ కింద కుతుబ్‌షాషీ హెరిటేజ్ పార్క్, పైగా సమాధులు, హయాత్భక్షీ మసీదు, రేమాండ్స్ సమాధి అభివృద్ధికి రూ.96.9 కోట్లు మంజూరు చేయగా, రూ.45.30 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.