హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో 996 అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉన్నదని నివేదించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో అంగన్వాడీ కేంద్రాల సంఖ్య పెంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. 12 ఏండ్ల క్రితం ఉన్న అంగన్వాడీలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్వాడీలున్నాయి. వీటిలో 31,711 మెయిన్ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీలు. 2008-09 తరువాత కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని కూడా అదనంగా మంజూరు చేయలేదు. తాజాగా మరో 996 కేంద్రాలు అవసరమని రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. వీటిలో 126 కేంద్రాలను రీ-లొకేట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. 870 కేంద్రాలు కొత్తవి. అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ అనుమతి ఇవ్వాలి. దీంతో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ డిప్యూటీ సెక్రటరీకి జిల్లాలవారీగా కొత్త అంగన్వాడీల కోసం ప్రతిపాదన పంపింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 4,811 అంగన్వాడీలుండగా, కొత్తగా 350 కేంద్రాలు అదనంగా కావాలని కోరింది. 996 కేంద్రాల్లో 670 మెయిన్, 326 మినీ అంగన్వాడీలున్నాయి.
స్త్రీ,శిశు సంక్షేమానికి కొత్త బాటలు
స్త్రీ, శిశు సంక్షేమం కోసం ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. 0-5 ఏండ్లలోపు పిల్లలు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. బాలామృతం, బాలామృతం ప్లస్ వంటి కార్యక్రమాలతో చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళల కోసం గిరిపోషణ్ పేరుతో వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నది. కొత్త అంగన్వాడీల ఏర్పాటుకు ఆ ప్రాంత జనాభా, రెండు కేంద్రాల మధ్య దూరాన్ని ప్రాతిపదికగా తీసుకొంటారు.