Inter Results | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఎప్పటిలాగే ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. ఫస్టియర్, సెకండియర్‌లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, కామారెడ్డి అట్టడుగున నిలిచింది. సెకండియర్‌లో ములుగు జిల్లా టాప్‌లో ఉండగా, సూర్యాపేట చివరి స్థానంలో నిలిచింది. బుధవారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. అత్యధికులు ‘ఏ’ గ్రేడ్‌లోనే పాసయ్యారు. ఫస్టియర్‌లో 60.01% , సెకండియర్‌లో 64.19% ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో ఉత్తీర్ణతశాతం పెరిగింది. ఫస్టియర్‌లో మూడేండ్లుగా తగ్గుతూ వస్తున్నది.
జిల్లాల వారీగా..
ఫస్టియర్‌లో రంగారెడ్డి జిల్లా 71.7శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానంలో ఉండగా.. మేడ్చల్ జిల్లా 71.58%తో ద్వితీయ స్థానంలో, ములు గు జిల్లా 70.01%తో తృతీయ స్థానం లో నిలిచాయి. కామారెడ్డి (44.29%), నారాయణపేట(53.61%), మెదక్ (57. 49%) ఉత్తీర్ణతతో చివరి మూడుస్థానాల్లో నిలిచాయి. సెకండియర్‌లో 82.95% ఉత్తీర్ణతతో ములుగు ప్రథమ స్థానం, 79.31%తో మేడ్చ ల్ ద్వితీ య స్థానం, 77.63%తో రంగారెడ్డి తృతీయ స్థానం దకాయి. సూర్యాపేట (39.9), యాదాద్రి(41.7), సిద్దిపేట(42.4%) ఉత్తీర్ణతతో చివరి మూడుస్థానాల్లో నిలిచాయి.
‘ఏ’ గ్రేడ్‌లోనే అత్యధికులు పాస్
ఇంటర్లోఅత్యధికులు ‘ఏ’ గ్రేడ్‌లోనే పాసయ్యారు. ఫస్టియర్‌లో 2,87లక్షల మంది పాస్ కాగా, వీరిలో 1.86 లక్షలమంది 75శాతానికి పైగా మార్కులతో ‘ఏ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. 68,985 మంది ‘బీ’ గ్రేడ్‌లో, 23,968 మంది ‘సీ’ గ్రేడ్‌లో, 8,283 మంది ‘డీ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 1.94 లక్షలమంది ‘ఏ’ గ్రేడ్, 78 వేలమంది ‘బీ’ గ్రేడ్, 25 వేలమంది ‘సీ’ గ్రేడ్, 8 వేలమంది ‘డీ’ గ్రేడ్‌లో పాసయ్యారు.
మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈనెల 25నుంచి మే 2వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కొరకు అభ్యర్థులు బుధవారం నుంచి మే 2వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, రీవెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.600 ఫీజు చెల్లించాలి. ఫలితాలకు సంబంధించిన ఫిర్యాదులంటే 040 -24655027 నంబర్‌ను సంప్రదించవచ్చు.
19