సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): రానురానూ వీధికుక్కలు చిన్నారుల పాలిట మృత్యుమృగాలుగా మారుతున్నాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న వారిపై కూడా మందగా దాడి చేస్తున్నాయి. ఫలితంగా రోజుకు సరాసరి 100 వరకు కుక్కకాట్లు జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి.
కనబడితే చాలు.. కరిచిపడేసి
జూన్ 6వ తేదీన మియాపూర్‌లో ఆరేండ్ల సాత్విక్‌ను వీధి కుక్కలు చంపేశాయి.. మొన్నటికిమొన్న చిత్రపురి కాలనీలో వాకింగ్ చేస్తున్న గృహిణిపై కుక్కల మంద దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో వీధి కుక్కలు స్కూల్‌కు వెళ్లే చిన్నారులపై దాడిచేయగా ఓ బాలుడు చనిపోయాడు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదేండ్ల దీపాలి ఆడుకుంటుండగా కుక్కలు దాడిచేశాయి. ఆ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. ఇలా.. వీధి కుక్కలు చిన్నారుల పాలిట మృత్యుమృగాలుగా మారుతున్నాయి. ఒంటరిగా వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని మందకు మంద కలిసి దాడి చేస్తున్నాయి.
పగబట్టినట్లే ప్రవరిస్తూ కండలు పీకేస్తూ ప్రాణాలను తీస్తున్నాయి. వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలంటూ జీహెచ్ఎంసీకి ప్రతిరోజూ 98కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు వీధి కుక్కల నియంత్రణను జీహెచ్ఎంసీ గాలికి వదిలేసింది. తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నది. ప్రధానంగా వీధికుక్కలకు ఏబీసీ (యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్) ఆపరేషన్లేగాక, రేబిస్ నివారణ టీకాలను వేయడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తున్నది. నగరంలో 5 చోట్ల జంతు సంరక్షణ కేంద్రాలు ఉండగా.. ప్రతి సంవత్సరానికిగానూ రూ.11.5 కోట్లు ఖర్చు చేస్తున్నా వీధి కుక్కల బెడద తగ్గడం లేదు. వీధి కుక్కల నియంత్రణకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసినా ఫలితం అంతంత మాత్రమే ఉన్నది.
స్టెరిలైజ్ చేస్తున్నా..
గడిచిన పదేళ్ల కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో 8 మంది చిన్నారులు వీధి కుక్కల బారిన పడి చనిపోయినట్లు అధికారులు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నివేదిక ప్రకారం వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు, పిల్లులు, కోతులు 3,36,767 మందిని కరిచినట్టు అధికారులు తెలిపారు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వీధి కుక్కల బెడదకు సంబంధించి 3,60,469 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అంటే సరాసరి రోజుకు 98 మంది కుక్కల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన పదేళ్ల కాలంలో 721,291 వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేసి టీకా వేసినట్లు అధికారులు తెలిపారు. వీధి కుక్కలకు సంతాప నిరోధక శస్త్రచికిత్సలు, వ్యాక్సిన్లు చేశామని చెబుతున్నా పెరుగుతున్న కుక్క కాట్లు అధికారుల నిర్లక్ష్యపు పనితీరుకు అద్దం పడుతున్నాయి.