సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) పథకం లబ్ధిదారుల సహనానికి పరీక్ష పెడుతున్నది. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణతో ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని ఆరాటపడేవారికి జీహెచ్ఎంసీ అధికారులు ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. హైడ్రా కూల్చివేతల తంటాతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతూ కొందరు, మరికొందరు భవిష్యత్తులో మరెన్ని ఇబ్బందులు వస్తాయోనని చిన్న, చిన్న కారణాలతోనూ అప్లికేషన్స్‌ను రిజెక్ట్ చేస్తున్నారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాల సమీపంలో ఉన్నట్టు తెలిస్తే చాలు దరఖాస్తులను ఆమడదూరం పెడుతున్నారు. ఎఫ్టీఎల్ ఖరారు కాని చెరువులు, కుంటల పరిధిలోని అన్ని సర్వే నంబర్ల దరఖాస్తులను వెనక్కి పంపించేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో షార్ట్‌ఫాల్ డాక్యుమెంట్ పేరుతో దరఖాస్తుదారులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలపై నీటి పారుదల శాఖ అధికారులు ఎన్వోసీ ఇస్తేనే ముందడుగు వేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ఖజానా నింపుకోవాలని భావించగా, హైడ్రా కూల్చివేతలు ఆ ఆశలపై గండికొట్టినట్లయింది.
క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్-2020 కింద వచ్చిన దరఖాస్తులతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,06,891, హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 60వేలకు పైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఈ దరఖాస్తులను క్లస్టర్ల వారీగా విభజన చేసి, ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన సులభంగా చేపట్టేందుకు వీలుగా గ్రామం, వార్డు, సర్వే నంబరు, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించే ప్రక్రియను చేపట్టారు. జోనల్ వారీగా దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నది. సదరు ప్లాటు ప్రభుత్వ భూమిలో ఉందా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? వంటి అంశాలను పరిశీలించి… దరఖాస్తు క్రమబద్ధీకరించేందుకు అర్హత ఉందా? లేదా? అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కువ శాతం ప్రొసీడింగ్స్ వరకు వెళ్లడం లేదని, చాలా వరకు తిరస్కరణకు గురవుతున్నాయని దరఖాస్తుదారులు వాపోతున్నారు.