హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏడో ఇండో-జర్మన్ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జర్మనీకి చెందిన ఎనిమిది మంది మంత్రుల బృందం శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు-2030 ఎజెండాలో భాగంగా ఈ సమావేశం జరుగనున్నట్టు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ‘ఫోకస్ ఇండియా’ వ్యూహం పేరిట జరుగనున్న ఈ భేటీలో వాతావరణం, జీవవైవిధ్యం పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. వీటితోపాటు జర్మనీ-భారత్ మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతం, పరిశోధనలు, నైపుణ్య రంగాల్లో చేయూత, భద్రతాపరమైన సహాయం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్లో భాగంగా జర్మనీ దేశంలోని రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల బృందం గురువారం తెలంగాణ శాసనసభను సందర్శించింది. అసెంబ్లీకి విచ్చేసిన రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్డ్రిక్ హేరింగ్ నాయకత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జర్మనీ బృంద సభ్యులకు పుష్పగుచ్ఛం అందించి శాలువా, జ్ఞాపికలతో సతరించారు.