హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Modi) ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె(General strike) ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో సమ్మెతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సేవలు నిలిచిపోయాయి. సార్వత్రిక సమ్మెకు సహకరించాలని డ్రైవర్లు ఎక్కడికక్కడే బస్సులు, కార్లు, ఆటోలను అడ్డుకుంటున్నారు. రోడ్డుపైనే వాహనాలను నిలువరించి ప్రయాణికులను దించేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. కొన్ని చోట్ల కాలి నడకనతో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ సమ్మెకు సహకరించాలని డ్రైవర్లు ప్రజలను వేడుకుంటున్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల ఐక్య చర్యతో పనులు నిలిచిపోయాయి.
కాగా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి (12న) నేడు భారత్ బంద్కు కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. సమ్మె కారణంగా బ్యాంకింగ్, బీమా, రవాణా రంగాలకు అంతరాయం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, జాతి వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు జనవరి 9న కొన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
