హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజూ కృష్ణణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులు చాలా దారుణమైన సంక్షోభంలో ఉన్నారని తెలిపారు.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా ఈ సంక్షోభం మరింత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో పోరాటాలు జరుగుతున్నాయని వివరించారు. 2014 నుంచి 2026 వరకు దేశంలో దాదాపు 5 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అఖిలభారత కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా, యువజన, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో పాల్గొంటారని తెలిపారు.