హుజూరాబాద్: ఈ ఉప ఎన్నికలో నమ్మకానికి మారుపేరైన టీఆర్ఎస్కు, అమ్మకానికి కేరాఫ్ అడ్రస్ అయిన బీజేపీకి మధ్య పోటీ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం మూడు, నాలుగో నామినేషన్ సెట్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో అబద్ధాల బీజేపీకి.. నిబద్ధతగల టీఆర్ఎస్కు.. ఆరాచకానికి.. అభివృద్ధికి..రూపాయి బొట్టు బిల్లకు..లక్ష రూపాయల కల్యాణలక్ష్మికి మధ్య పోటీ అని హరీశ్‌రావు అన్నారు.
తమ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఊరూరా ఘన స్వాగతం లభిస్తున్నదని చెప్పారు. పేదింటి బిడ్డ అయిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఎన్నికల ఖర్చుల కోసం ప్రజలే డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. పలువురు పేద మహిళలు ఆసరా పింఛన్ డబ్బులు ఇచ్చి ఆశీర్వదించారని పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడన్నారు.
హూజూరాబాద్‌లో ముందునుంచే టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2001 లో రైతు నాగలి గుర్తుమీద నిలుచున్న ప్రజాప్రతినిధులను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ రాకముందు.. ఆయన వెళ్లిపోయాక కూడా ఇక్కడ గెలిచేది టీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టంచేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసునని, అందుకే ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్‌కే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తాము సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, కేసీఆర్ ఇంట్లోనుంచి ఇస్తున్నారా? అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ఆ పార్టీ నాయకులే సమాధనాం చెప్పాలన్నారు. సంపద పెంచు.. పేదలకు పంచు అనేది కేసీఆర్ విధానం అని, పేదలను దంచు.. పె(గ)ద్దలకు పంచు అనేది బీజేపీ విధానమని హరీశ్‌రావు అభివర్ణించారు. తెలంగాణ వచ్చినప్పటినుంచీ రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు డీజిల్ ధరలు పెంచి, కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చి అన్నదాతలను అరిగోసపెడుతున్నదన్నారు. ఈ ఉప ఎన్నికలో రైతు బాంధవుడైన కేసీఆర్ వైపు ఉంటారో లేదా అన్నదాతల ఉసురుపోసుకుంటున్న బీజేపీ వైపు ఉంటారో హుజూరాబాద్ రైతులు తేల్చుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
పేదల ఆత్మగౌరవానికి..ఈటల అహంకారానికి మధ్య పోటీ: గెల్లు శ్రీనివాస్‌యాదవ్
200 ఎకరాల్లో ఒక ఎకరం అమ్మి గెలుస్తానంటూ ఈటల రాజేందర్ అహంకారంగా మాట్లాడుతున్నారని, కానీ హుజూరాబాద్ ప్రజలు నిరుపేద బిడ్డనైన తన వెంటే ఉన్నారని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఈ ఎన్నిక ఈటల అహంకారానికి..పేద ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య పోటీ అని అభివర్ణించారు. తనకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని, హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసేంత శక్తిని తనకు దేవుడిచ్చాడని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈటల వందల కోట్లు తన గెలుపును ఆపలేవన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులతో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత పాడి కౌశిక్‌రెడ్డి, తదితరులున్నారు.