GDP | న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశ ఆర్థిక వ్యవస్థను నిస్తేజం ఆవరించింది. ఓవైపు వృద్ధిరేటు.. మరోవైపు కీలక రంగాల పనితీరు మందగించాయి. శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ జీడీపీ 15 నెలల కనిష్టానికి దిగజారినట్టు తేలింది. అలాగే జూలై నెలకుగాను 8 కీలక రంగాల్లో వృద్ధిరేటు 6.1 శాతానికే పరిమితమైనట్టు స్పష్టమైంది.
వ్యవసాయ, సేవా రంగాలు డీలా
వ్యవసాయ, సేవల రంగాల ప్రదర్శన పేలవంగా ఉండటమే ఈ ఏప్రిల్-జూన్‌లో దేశ జీడీపీ వృద్ధిరేటు 5 త్రైమాసికాల కనిష్టాన్ని తాకుతూ 6.7 శాతానికే పరిమితం కావాల్సి వచ్చిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) పేర్కొన్నది. 2023 జనవరి-మార్చిలో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లోకి ఇప్పుడే గణాంకాలు వెళ్లాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-జూన్‌లో 8.2 శాతంగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది జనవరి-మార్చిలోనూ 7.8 శాతం వృద్ధి కనిపించింది. దీంతో 3 నెలల్లో జీడీపీ 1 శాతానికిపైగా పడిపోయినైట్టెంది.
ఆయా రంగాలవారీగా..
ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగ జీవీఏ (గ్రాస్ వాల్యూ ఆడెడ్) 3.7 శాతం నుంచి 2 శాతానికి క్షీణించినట్టు ఎన్ఎస్వో తెలియజేసింది. అలాగే ఆర్థిక, నిర్మాణ, ప్రొఫెషనల్ సర్వీసెస్ జీవీఏ కూడా నిరుడు ఏప్రిల్-జూన్‌తో పోల్చితే 12.6 శాతం నుంచి 7.1 శాతానికి దిగజారింది. ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ విభాగాల్లోనూ వృద్ధి 9.7 శాతం నుంచి 5.7 శాతానికి పతనమైంది. ఈ క్రమంలోనే ప్రధానమైన తయారీ రంగ జీవీఏ 2 శాతం పెరిగి 7 శాతానికి పుంజుకున్నా.. మైనింగ్-క్వారీయింగ్, విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సర్వీసుల్లో ఆకర్షణీయ వృద్ధి ఉన్నా ఫలితం లేకపోయింది. ఇదిలావుంటే ప్రస్తుత ధరల వద్ద ఈసారి జీడీపీ విలువ రూ.77.31 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఓ ప్రకటనలో ఎన్ఎస్వో తెలిపింది.
మౌలికం బేజారు
దేశ పారిశ్రామిక ప్రగతికి ప్రామాణికంగా భావించే 8 కీలక రంగాల్లో మందగమనం అలుముకున్నది. గత నెల జూలైలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్తు రంగాల్లోని ఉత్పాదకతలో వృద్ధిరేటు 6.1 శాతంగానే ఉన్నది. నిరుడు జూలైలో ఇది 8.5 శాతంగా ఉండటం గమనార్హం. భారతీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ 8 రంగాల వాటా 40.27 శాతంగా ఉండటం విశేషం. అలాంటిదిప్పుడు ఆయా రంగాల్లో ఉత్పత్తి ఏడాది కాలంలో 2.4 శాతం మేరకు పడిపోయింది. ముడి చమురు ఉత్పత్తి మైనస్ 2.9 శాతంగా, సహజ వాయువు ఉత్పత్తి మైనస్ 1.3 శాతంగా ఉండటం దెబ్బతీసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బొగ్గు, ఉక్కు, సిమెంట్, విద్యుత్తు రంగాల్లోనూ ఉత్పాదకత గతంతో పోల్చితే వరుసగా 6.8 శాతం, 7.2 శాతం, 5.5 శాతం, 7 శాతాలకు పడిపోయింది. దీంతో రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల్లో 6.6 శాతం, 5.3 శాతం చొప్పున వృద్ధి నమోదైనా ప్రయోజనం లేకపోయింది.