Donald Trump | ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. తొలి దశ శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ నేడు ఇజ్రాయెల్ బందీలను (hostage) విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇజ్రాయెల్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. మానంలో బయలుదేరే ముందు రిపోర్టర్లతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘గాజాలో యుద్ధం ముగిసింది. ఇక పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నాను’ అంటూ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదన, ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్‌తో 20 అంశాల ప్రణాళికకు పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ అంగీకరించడంలో రెండు రోజుల క్రితమే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ప్రారంభమైంది. ఈ ఒప్పందంలో భాగంగా నేడు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది. మరికాసేపట్లో బందీలు హమాస్ చెర నుంచి బయటపడనున్నారు. నేడు ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బందీలను పరామర్శించనున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రారంభం కావడంతో ప్రపంచ నేతలు ఈజిప్ట్‌లో జరిగే గాజా శాంతి సదస్సు శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసిల అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం గాజా శాంతి ఒప్పందం జరగనుంది. గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించి, శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరవుతున్నారు.
Also Read..
అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి, 20 మందికి గాయాలు
శాంతి శాశ్వతమయ్యేనా?.. బందీల విడుదలపై సర్వత్రా ఎదురుచూపులు
Sherry Singh | మిసెస్ యూనివర్స్‌గా షెర్రీ సింగ్.. టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డ్