Lemon Juice | నిమ్మకాయలను మనం తరచూ అనేక వంటకాలలో ఉపయోగిస్తూనే ఉంటాం. నిమ్మరసాన్ని పలు వంటకాల్లో వాడుతారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, రంగు వస్తాయి. ఇక ఆయుర్వేద ప్రకారం నిమ్మ మనకు అనేక లాభాలను అందిస్తుంది. నిమ్మరసంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నిమ్మరసాన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. అయితే నిమ్మరసాన్ని తాగే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటి గురించి ఆయుర్వేద వైద్యులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మరసం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది కనుక ఉదయం పరగడుపున తాగవచ్చా..? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఇందుకు వైద్యులు ఏమంటున్నారంటే..
ఆరోగ్యవంతమైన వ్యక్తులు నిమ్మరసాన్ని తాగవచ్చు. పరగడుపున తాగినా దుష్పరిణామాలు కలగవు. కానీ పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం నిమ్మరసాన్ని పరగడుపున తాగకూడదు. ముఖ్యంగా అసిడిటీ, అల్సర్, కడుపు నొప్పి, పొట్టలో అసౌకర్యం ఉన్నవారు నిమ్మరసాన్ని పరగడుపున తాగకూడదు. జీర్ణాశయ సంబంధిత మెడిసిన్లను వాడేవారు కూడా నిమ్మరసాన్ని పరగడుపున సేవించకూడదు. అయితే నిమ్మరసం దంతాల ఎనామిల్‌పై ప్రభావం చూపిస్తుంది. కనుక దీన్ని నేరుగా తాగకూడదు. కచ్చితంగా నీటిలో కలిపి సేవించాల్సి ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు 30 నిమిషాల ముందు తాగాల్సి ఉంటుంది. ఇలా నిమ్మరసాన్ని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
నిమ్మరసాన్ని పరగడుపునే సేవించడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. జీర్ణ రసాల ఉత్పత్తి మెరుగు పడుతుంది. పైత్య రసాలు సక్రమంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. నిమ్మరసాన్ని సేవించడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం తగ్గిపోతాయి. నిమ్మరసాన్ని ఉదయం సేవిస్తుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. రోజంతా బయట తిరిగేవారు లేదా పనిచేసేవారు ఉదయం నిమ్మరసాన్ని సేవిస్తుంటే శరీరంలోని నీరు బయటకు వెళ్లకుండా ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ సమస్థితిలో ఉంటాయి. దీని వల్ల శరీరంలో వేడి చేరదు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. నీరసం, అలసట రావు.
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. మన చర్మానికి నిమ్మరసం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల చర్మ కాంతి మెరుగు పడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని రోజూ సేవిస్తుంటే జీర్ణశక్తి పెరిగి మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఇలా నిమ్మరసాన్ని సేవించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.