ముంబై, జూలై 14 : ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనప్పటికీ దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ సంపద మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. గడిచిన ఏడాదికాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్ ఆదాయం 72 శాతం వృద్ధి నమోదైందని 2026 గ్రోహ్-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150’ పేరుతో విడుదలైన నివేదిక వెల్లడించింది. కొన్నేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న గౌతమ్ అదానీ కుటుంబం..ఇటీవల ముంబైలోని ధారావి స్లమ్ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది.
ప్రణవ్, రాజేశ్ అదానీలు నిర్వహిస్తున్న అదానీ ప్రాపర్టీస్ గత ఏడాదికాలంలో విలువ రూ.38 వేల కోట్లు పెరిగి రూ.90,400 కోట్లకు చేరుకున్నది. దీంతో ఆయన స్థానం నాలుగో స్థానానికి ఎగబాకింది. బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 20 శాతం పతనమవడంతో 151 కంపెనీల్లో కేవలం 31 సంస్థల విలువ మాత్రం పెరుగగా, 74 సంస్థల విలువ పడిపోయింది. ఆయా మొత్తం సంస్థల నికర విలువ కేవలం రెండు శాతం అధికమైనట్టు నివేదిక వెల్లడించింది. గడిచిన తొమ్మిదేండ్లలో ఇదే అత్యల్ప వృద్ధి అని హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహమాన్ తెలిపారు. కానీ, ఒబెరాయి, ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాపర్టీస్, గోద్రెజ్ ప్రాపర్టీలు టాప్-10 నుంచి వైదొలిగాయి.
