ముంబై, జూలై 14 : ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బీమా ఉత్పత్తుల అమ్మకాల నుంచి కమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించాయి. బ్యాంకర్ల వార్షిక నివేదికలను విశ్లేషించిన పీటీఐ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్బీఐ అత్యధికంగా రూ.2,795. 01 కోట్లను ఇన్సూరెన్స్ కమీషన్‌గా పొం దింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోల్చితే 19.26 శాతం పెరిగింది. నాడు రూ.2,345.36 కోట్లను అందుకున్నది. కాగా, 2025-26కుగాను ఎస్బీఐకి బీమా కమీషన్‌గా వచ్చిన ఆదాయంలో 85 శాతం (రూ.2,384.63 కోట్లు) తమ జీవిత బీమా అనుబంధ సంస్థ ఎస్బీఐ లైఫ్ పాలసీల పంపిణీ ద్వారానే సమకూరింది. ఇక కెనరా బ్యాంక్‌కు రూ.566.36 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు రూ.475.45 కోట్లు, పీఎన్బీకి రూ.438.67 కోట్లు, బీవోబీకి రూ.368.93 కోట్లు, ఇండియన్ బ్యాంక్‌కు రూ.190.65 కోట్లు, సెంట్రల్ బ్యాంక్‌కు రూ.160.90 కోట్లు, యూకో బ్యాంక్‌కు రూ.66.08 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కు రూ.31.98 కోట్లు బీమా కమీషన్‌గా వచ్చాయి.
బీమా కమీషన్ల ఆదాయంలో మెజారిటీ ప్రభుత్వ బ్యాంకులు వృద్ధిని కనబర్చగా.. మ్యూచువల్ ఫండ్ పంపిణీలో మాత్రం ఆ స్థాయి వృద్ధిరేటు నమోదు కాలేదు. ఎస్బీఐకి గతంతో పోల్చితే 7.05 శాతం పెరిగి రూ.1,511.06 కోట్ల నుంచి రూ.1,617.52 కోట్లకు మ్యూచువల్ ఫండ్ పంపిణీ నుంచి కమీష న్ ఆదాయం వచ్చింది. ఇందులో బ్యాంక్ అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాటానే రూ.1,209.33 కోట్లుగా ఉన్నది. అలాగే కెనరా బ్యాంక్ రూ.72.84 కోట్లు, బీవోబీ రూ.142.52 కోట్లు, పీఎన్బీ రూ.163.41 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.29.66 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.4.74 కోట్లు, యూకో బ్యాంక్ రూ.2.23 కోట్లను మ్యూచువల్ ఫండ్ పంపిణీ నుంచి కమీషన్‌గా ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన సంవత్సర కాలంలో దక్కించుకున్నాయి. కాగా, బ్యాంకులు తమ అసలు వ్యాపార కార్యకలాపాలైన డిపాజిట్లు, రుణాల పంపిణీపై దృష్టి పెట్టాలని, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీలపై కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈమధ్యే సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం కమీషన్ల ఆదా యం ఎలా ఉంటుందో తేలాల్సి ఉన్నది.