ముంబై, జూలై 14 : దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ గల్ఫ్ యుద్ధం భయాలు ఆవహించాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తకర వాతావరణం.. పశ్చిమాసియాను మరోమారు సంక్షోభంలోకి నెట్టగా, అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తిరిగి విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మదుపర్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం పతనమై 77,054.94 వద్దకు పడిపోయింది. ఒకానొక దశలోనైతే 614.92 పాయింట్లు లేదా 0.79 శాతం దిగజారడం గమనార్హం. దీంతో అంతకుముందు వరుస 3 రోజుల లాభాలకు బ్రేక్ పడినైట్టెంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం క్షీణించి 24,052.05 వద్ద ఆగింది. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ 96 మార్కు దిగువకు చేరడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సెన్సెక్స్ షేర్లలో హెచ్‌సీఎల్ టెక్ అత్యధికంగా 4.42 శాతం పతనమైంది. బజాజ్ ఫిన్సర్వ్, ఇండిగో, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ షేర్లూ క్షీణించాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు 4.26 శాతం ఎగిసి 86.85 డాలర్లను తాకింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ధరలు ఇంకా పెరుగడం ఖాయమన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హొర్ముజ్ జలసంధిలో రవాణా ఇబ్బందికరంగా మారడంతో భారత్‌పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా, మెజారిటీ వాటా యూఏఈ, సౌదీ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది మరి. ఇప్పటికే దేశంలో రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ముడి చమురు దిగుమతులు భారమైతే ధరలు మరింత ఎగబాకుతాయి. దీంతో రాబోయే ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపునకే మొగ్గు చూపుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే అంతిమంగా దేశ జీడీపీ ప్రభావితం కాగలదని, మదుపర్లలో ఈ భయాలే లాభాల స్వీకరణకు దారితీస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
బ్యాంకింగ్, రియల్టీ, ఆటో, ఆర్థిక సేవలు, ఐటీ రంగాల షేర్లు నష్టాలకు గురయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.01 శాతం, స్మాల్‌క్యాప్ 0.55 శాతం చొప్పున పడిపోయాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగియగా, యూరోపియన్ ప్రధాన సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) రూ.3,062.27 కోట్ల పెట్టుబడులను దేశీయ మార్కెట్ల నుంచి వెనుకకు తీసుకున్నారు.