LPG Gas | నమస్తే తెలంగాణ నెట్వర్క్: అమెరికా,ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో మన దేశంలోని సామాన్యుల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతున్నది. నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారుల గుండెల్లో దడ పుడుతున్నది. ఒకవైపు గృహావసరాల గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ప్రభుత్వాలు చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్ర కొరత వినియోగదారులను వేధిస్తున్నది. చాలాచోట్ల ఏజెన్సీలే కృత్రిమ కొరతను సృష్టిస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. గ్యాస్ బుకింగ్ కాకపోవడం, బుకింగ్ అయినా సకాలంలో డెలివరీ కాకపోవడంతో వినియోగదారుల సహనం నశించిపోతున్నది. రోజులకొద్దీ వేచి ఉండలేక ఏకంగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్దకే భారీగా చేరుకుంటున్నారు. కొరతపై నిర్వాహకుల వద్ద మండిపడుతున్నారు. ఆ కార్యాలయాల ఎదుట ఖాళీ సిలిండర్లు పెట్టుకొని కొద్దిపాటి యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. పొద్దస్తమానం ఎదురు చూసినా సిలిండర్ దొరక్కపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒక ఊరు, ఒక ఏజెన్సీ అని కాకుండా అంతటా ఇవే ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ ఉషోదయ టవర్స్‌లో ఉన్న శాంభవి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు శుక్రవారం పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్యాస్ బుకింగ్ కావడం లేదని, రోజులు గడిచినా డెలివరీ ఎందుకు చేయడం లేదని వినియోగదారులు ఏజెన్సీ నిర్వాహకులను నిలదీశారు. భారీగా వినియోగదారులు చేరుకోవడంతో వారి తాకిడిని తట్టుకోలేని నిర్వాహకులు కార్యాలయాన్ని మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన బాధితులు కార్యాలయం ఎదుట ఖాళీ సిలిండర్లతో గంటలకొద్దీ వేచి ఉన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను అధిక ధరలకు కమర్షియల్ వినియోగదారులకు అమ్ముకుంటున్నారని పలువురు విమర్శించారు. కృత్రిక కొరత సృష్టిస్తున్న ఏజెన్సీల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరంలో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్‌కు రూ.2 వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది. దీనికి తోడు నగరవాసులకు నిత్యావసర ధరల సెగ తగులుతున్నది. గ్యాస్ కొరత కారణంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్, వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పలు వస్తువులకు 10 శాతం నుంచి 20 శాతం ధరలు పెరిగినట్టు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ మార్కెట్లో రూ.20 అదనపు చార్జీతో పప్పులు విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయలకైనా సగటున రూ.40 ఉండగా, పచ్చిమిర్చి, చిక్కుడు వంటి వాటికి రూ.60 నుంచి రూ.90 వరకు పలుకుతున్నాయి. డ్రైఫ్రూట్స్ నాణ్యత ఆధారంగా ఏ రకానికైనా అదనంగా రూ.70 నుంచి రూ.100 వరకు పెరిగాయని బేగంబజార్ షాప్ నిర్వాహకుడు సయ్యద్ పాషా తెలిపారు. ‘వంట చేసుకునేందుకు గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. దీంతో నిత్యావసరాల సరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో బతకడమే కష్టంగా మారింది’ అని హైదరాబాద్‌కు చెందిన గృహిణి కల్పనాదేవి ఆందోళన వ్యక్తంచేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ ఎదుట శుక్రవారం పోలీస్ బందోబస్తు నడుమ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. సిలిండర్ల కోసం వినియోగదారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. సీపీఐ కార్యాలయం రోడ్డులో ఉన్న ఆ గ్యాస్ ఏజెన్సీ వద్దకు ఉదయం ఏడు గంటలకే భారీగా జనం ఖాళీ సిలెండర్లతో క్యూ కట్టారు. మూడ్రోజులుగా గ్యాస్ బుక్ కావడం లేదని, డెలివరీ సైతం లేకపోవడంతో ఏకంగా వారంతా ఏజెన్సీ కార్యాలయం వద్దకే చేరుకున్నారు. గ్యాస్‌బండ రాకున్నా సరఫరా అయినట్లు ఫోన్ మెసేజ్ వచ్చిందని అక్కడికి వచ్చిన పలువురు వినియోగదారులు వాపోయారు. బుక్ చేసుకున్న తర్వాత ఓటీపీ వచ్చిన వారికి ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ బండలను పంపిణీ చేశారు. వాణిజ్య సిలిండర్లు సరఫరా కాకపోవడంతో పలు హోటళ్లలో నిర్వాహకులు కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు. సిలిండర్ల కొరత కారణంగా తాము నష్టపోతున్నామని, ప్రభుత్వం తాము ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విధంగా నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలోనూ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గ్యాస్ సిలిండర్లు బుకింగ్ కావడం లేదని శుక్రవారం హెచ్‌పీ గ్యాస్ గోదాం వద్ద వినియోగదారులు ఆందోళన నిర్వహించారు. మూడు రోజులుగా గ్యాస్ సిలిండర్ డెలివరీ కావడం లేదని ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడ్డారు. మూడు రోజులుగా తమ ఇండ్లలో పొయ్యి వెలిగించలేదంటూ వాగ్వాదానికి దిగారు. పైనుంచి సిలిండర్లు రావడం లేదని, తాము ఇప్పటికిప్పుడు సరఫరా చేయలేమని నిర్వాహకులు చేతులెత్తేశారు. బుకింగ్ అయిన వారికి సిలిండర్లు రాగానే ఇండ్లకే చేరవేస్తామని భరోసా ఇచ్చారు. చేసేదిలేక ఆందోళన విరమించారు. చిరువ్యాపారులు కమర్షియల్ గ్యాస్ దొరక్క, బ్లాక్‌లో కొనలేక వ్యాపారాలు మూసేస్తున్నారు. వంటగ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిల పైనే వంటలు చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో 10 రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా తెల్లారి లేస్తే సాగు పనులకు వెళ్లే పల్లె జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మళ్లీ పాత రోజులు వచ్చాయంటూ ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ పనులు మానుకొని కట్టెల కోసం బయటికి రావాల్సి వచ్చిందని వారు వాపోయారు.