
సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వినూత్న పద్ధతిలో వెల్లుల్లి సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా(కె) గ్రామానికి చెందిన వడ్ల ఆనంద్. ఆయనకు గ్రామ శివారులో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతి ఏడాది వరితో పాటు పెసర, మినుము, సోయా తదితర పంటలను సాగు చేస్తున్నాడు. కాగా, గత సంవత్సరం క్లస్టర్ ఏఈవో సంతోష్ సూచన మేరకు తన పొలంలోని రెండు గుంటల్లో ప్రయోగాత్మకంగా వెల్లుల్లిని సాగు చేసి మంచి ఆదాయం ఆర్జించాడు. ఈసారి కూడా ఎకరా పొలంలో వెల్లుల్లిని సాగు చేశాడు.
రూ.2వేల పెట్టుబడితో రూ.8వేల దిగుబడి..
రెండు గుంటల్లో ప్రయోగాత్మకంగా పండించిన వెల్లుల్లి పంటకు రూ.2వేల వరకు పెట్టుబడి కాగా, రూ.8వేల దిగుబడి వచ్చింది. పెట్టుబడి పోను రూ.6వేల వరకు లాభం చేకూరింది. పెట్టుబడిలో భాగంగా దున్నకానికి రూ.300, విత్తనం 8 కిలోలకు రూ.800, ఎరువులకు రూ.400, పంట కోతకు రూ.500 ఖర్చు అయ్యాయి. రెండు గుంటల్లో వెల్లుల్లి 120 కిలోల దిగుబడి వచ్చింది. మార్కెట్లో కిలో వెల్లుల్లికి రూ.65కు విక్రయించుకోగా రూ.8వేలు వచ్చాయి. ప్రయోగాత్మకంగా సాగు చేసిన వెల్లుల్లి సాగు అధిక దిగుబడి ఇవ్వడంతో ఈ యాసంగిలో కూడా ఎకరం పొలంలో సాగు చేశాడు. ఆయనతో గ్రామంలో మరో ఇద్దరు రైతులు వెల్లుల్లి పంటను పండిస్తున్నారు. ఎకరాలో వెల్లుల్లి సాగుచేస్తే రూ.30వేల నుంచి 40 వేల వరకు పెట్టుబడి అవుతుందని, దిగుబడి 20 క్వింటాళ్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. వెల్లుల్లి సాగుకు ముఖ్యంగా నీటివసతి అవసరం కాగా, 4నెలల్లో కనీసం 6సార్లు తడులు పెట్టాల్సి ఉంటుంది.
అధికారుల సూచన మేరకు పండించాను..
చాప్టా(కె) క్లస్టర్ ఏఈవో సంతోశ్ సూచన మేరకు సాంప్రాదాయ పంటలకు స్వస్తి పలికి మొదట ప్రయోగాత్మకంగా రెండుగుంటల్లో వెల్లుల్లి పంటను సాగు చేశాను. రెండు గుంటలకు గాను రూ.6వేల వరకు లాభం వచ్చింది. దీంతో ఈఏడాది యాసంగిలో ఎకరాలో వెల్లుల్లి సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కూడా మంచి దిగుబడి వస్తుందని అనుకుంటున్న.
ఇతర పంటలపైదృష్టి సారించాలి..
వరి పంటకు బదులు ఇతరపంటలపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరముంది. ఎందుకంటే వరికి పెట్టుబడితో పాటు నీటివనరులు అధికం కావాలి. వెల్లుల్లి సాగుకు నెలకు రెండుసార్లు నీటిని తడిపితే 4నెలల్లోపు పంట చేతికొస్తుంది. వెల్లుల్లికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పండిన సత్వరమే వెల్లుల్లిని విక్రయించుకోవచ్చు. రైతులకు ఇతర పంటలపై
అవగాహన కల్పిస్తున్నాం.