నేడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి. గాంధీ తాత వయసు నేటికి 154 ఏండ్లు. ఒక మతోన్మాది తూటాలకు నేలకొరిగింది 75 ఏండ్ల క్రితం. ఆ సందర్భంగా ‘భావితరాల వారు ఇటువంటి మనిషి ఒకరు ఈ భూమి మీద నడిచారని నమ్మటం కష్టం’ అని విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న మాటలు చరిత్ర ఎన్నటికీ మరవదు. ఇది ముమ్మాటికీ నిజం.
నేటితరం వారికి గాంధీజీ లాంటి మనిషి ఈ గడ్డమీద జీవించాడన్న విషయం నమ్మశక్యం కాదు. ఎప్పుడు నమ్మశక్యం కాదు? ఆయన గురించి తెలుసుకున్నప్పుడు అటువంటి మనిషి ఒకరున్నారనేది నమ్మశక్యం కాదు. అసలు తెలియకపోతే ఇహ నమ్మటం, నమ్మలేకపోవటం అనే ప్రశ్నే లేవదు కదా! అందుకే ఆ మహనీయుడిని గురించి నేడు నెమరువేసుకోవటం చాలా సముచితం.
గాంధీజీ సిద్ధాంతం ఒక్క వ్యాసంలో చెప్పటం సాహసమే అవుతుంది. జీవితానికి సంబంధించిన అనేక అంశాల మీద గాంధీజీ తన భావాలను కూలంకుషంగా వివరించారు. ముఖ్యంగా ఆయన ఆత్మకథ నేటికీ ఒక ఆదర్శనీయ గ్రంథం. దీనితో పాటు, గాంధీజీ రచించిన పుస్తకాలు, గాంధీజీ మీద ఇతరులు రచించిన సాహిత్యం ఏ గ్రంథాలయానికెళ్లినా పుంఖాను పుంఖాలుగా దొరుకుతుంది. ఇక్కడ మహాత్ముడు చెప్పిన ముఖ్య విషయాలు రెండు, మూడింటిని ప్రస్తావించుకుందాం. వాటిని ఆకళింపు చేసుకుంటే అదే మహాత్ముడికి మనం సమర్పించుకునే నివాళి. గాంధీజీ గొప్ప అహింసావాది అనేది జగమెరిగిన సత్యం. నేడు ఎక్కడ చూసినా హింస ప్రబలటం మనం చూస్తున్నాం. హింసను విడనాడటం ఎలా? ఇది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న.
ఆధునిక మనిషికి ఓర్పు తక్కువ. ఏ విషయానికైనా అతివేగంగా స్పందించటం, భావోద్వేగానికి గురికావటం తద్వారా హింస చెలరేగటం ప్రజా జీవితంలో సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. హింస వలన ఏ సమస్యా పరిష్కారం కాదని మనిషికి తెలుసు. అయినా హింసకు బానిసవుతున్నాడు ఆధునిక మనిషి. ఇది వ్యక్తిగత జీవితం, ప్రజా జీవితం అనే తేడా లేకుండా అంతంతా విస్తరిస్తున్నది. దీనితో సమాజం అల్లకల్లోలమవుతున్నది. దీనిని ఆపాలంటే గాంధీజీ లాంటి స్థిత ప్రజ్ఞత గల నేత కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను దూరంగా పెట్టిన ‘గాంధీగిరి’ అవసరం. నాడు స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో చౌరాచౌరీ సంఘటనతో మరో ఆలోచన లేకుండా ఉద్యమాన్ని ఆపేశాడు గాంధీజీ. ఆనాడు ఉద్యమం ఆగకపోయి ఉంటే హింస దేశమంతా పాకి ఆ దెబ్బకు హడలిపోయి బ్రిటిష్ వారు దేశం విడిచిపోయేవారని, 1947 కంటే చాలా ఏండ్లు ముందే స్వతంత్రం వచ్చి ఉండేదని భావించిన వారున్నారు. బ్రిటిష్ పాలకులు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేవారని ఆ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారని అనుకునేవారూ ఉన్నారు. హింస తప్పు అని తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన స్థితప్రజ్ఞుడు గాంధీ తాత.
ఇద్దరు మనుషులు ఒకచోట ఉంటే, వారి మధ్య మూడు అభిప్రాయాలుండవచ్చు. అవి పరస్పరం విరుద్ధమైనవి కూడా కావచ్చు. కానీ, కొట్టుకోవటం వల్ల బలవంతుడు గెలవవచ్చు. కానీ, ఆ గెలుపు అతడి కండబలం గెలుపే గానీ బుద్ధిబలం గెలుపు కాదూ, కాజాలదు. మనిషి అంతరంగాన్ని ఏ చట్టమూ మార్చలేదు. నైతిక విలువలు బలంగా ఉన్నప్పుడే ప్రజా జీవితం ప్రజాస్వామ్యబద్ధంగా సాఫీగా ప్రవహించే నదీ ప్రవాహంలా సాగిపోతుంది. గాంధీ జయంతి నాడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది.
అందరిలో తాను ఒకడిగా ఉన్నాడు. తనలో అందరూ ఉండాలనుకున్నాడు. సాధారణ జీవితం గడిపాడు. నేటి కాలానికి గాంధీ సరిపోదనే వారూ ఉన్నారు. ఏ సిద్ధాంతమూ అన్ని కాలాలకు అనుగుణంగా ఉండదు. కానీ, మనం ఏ విధంగా ఆ సిద్ధాంతాన్ని అన్వయించుకుంటామన్నది ప్రధానం. ఇస్తారిలో ఉన్న ఆహారంలో అంతా కాకపోయినా చాలావరకు తింటాం. సిద్ధాంతం కూడా అంతే. అయితే ఎంతవరకు అన్వయించుకుంటామన్నదే పెద్ద సవాల్. అందుకే ప్రజల విశ్వాసాన్ని గెలిచాడు. జాతి యావత్తును ఒక తాటిమీదకు తీసుకువచ్చాడు. క్విట్ ఇండియా నినాదాన్ని ఒక మహోద్యమంగా మలచగలిగాడు. 77 వసంతాల స్వతంత్ర మనుగడ సాగించిన తర్వాత నేడు మనకు కావలసింది క్విట్ ఇండియా ఉద్యమం. నేడు దేశాన్ని మతం పేరుతో, కులం పేరుతో ప్రాంతం పేరుతో, భాష పేరుతో, సంకుచిత రాజకీయాలతో ‘విభజించి పాలించు’ అనే సూత్రాన్ని విశ్వగురువులుగా చెలామణి అవుతున్న నాయకులూ తెరమీదకు తెస్తున్నారు. ప్రజలు కావాలనుకునేది ఒకటైతే నేతలు కోరుకునేది మరొకటి.
ఆర్థికరంగంలో గాంధీజీ చెప్పిన విషయాలు కొన్ని నేటికీ ఆచరించదగినవే. ఉదాహరణకు చేనేత మన దేశానికి గొప్ప వారసత్వ సంపద. చీరను అగ్గిపెట్టెలో పెట్టేంత నైపుణ్యం కలిగినవారు మన నేతకారులు. సాలీనా ప్రతి ఒక్కరూ ఒక్క జతయినా సరే ఖద్దరు వస్ర్తాలు ధరిస్తే మన వారసత్వ సంపదను కాపాడిన వారమవుతాం. అబద్ధం ఆడవద్దన్నాడు గాంధీజీ. ఆ మాటకు చివరిదాకా కట్టుబడి ఉన్నాడు కాబట్టే ఆయన మహాత్ముడైనాడు. మనం మహాత్ములమవ్వవలసిన పనిలేదు. అయ్యిందానికి, కానిదానికి అబద్ధాలు చెప్పటం అలవాటైంది సగటు మనిషికి. ఎందుకు? మనిషికి తీర్చుకునే సామర్థ్యానికి మించిన కోర్కెలు కలుగుతున్నవి. మన ఆశలు మన శక్తికి లోబడి ఉంటే ఏ సమస్యా ఉండదు. సమస్యంతా, ఆ పరిధి దాటితేనే.