అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు యూరప్‌లోని పలు ప్రాంతాల్లో వలసలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ప్రదర్శన నిజానికి అన్ని దేశాలకు చెందిన వలసదారులకు వ్యతిరేకంగా జరిగింది. కానీ, మీడియా మాత్రం ఒక్క భారతదేశానికి చెందినవారికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనగానే చిత్రీకరించాయి.
ఒకవైపు వలసలకు వ్యతిరేకంగా ఇలా ప్రదర్శనలు జరుగుతుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకరకంగా మన దేశం నుంచి ఆ దేశానికి వలస వెళ్లే వారిపై యుద్ధాన్నే ప్రకటించారు. ఈ వైఖరి ఈ రోజే పుట్టింది కాదు , భారతీయులు తమ అవకాశాలను కొల్లగొడుతున్నారనే భావన అమెరికా వారిలో చాలాకాలం నుంచే ఉన్నది. భారతీయులకు తమ కంపెనీల్లో అవకాశాలు ఇవ్వవద్దని అమెరికా అధ్యక్షుడు ఆ మధ్య బహిరంగంగానే పిలుపునిచ్చాడు. టారిఫ్‌లు 25 శాతం పెంచడం, ఫార్మాపై ఏకంగా 100 శాతం టారిఫ్ పెంచడం, హెచ్-1 బీ వీసాకు లక్ష డాలర్లు ఫీజు నిర్ణయించడం ఒకరకంగా ఇండియా మీద ట్రంప్ ఏకపక్షంగా యుద్ధం ప్రకటించడమే.
యుద్ధం అంటే పూర్వకాలంలో వలె కత్తులు పట్టుకొని సైనికులు ఎదురెదురుగా నిలిచి కుత్తుకలు కోసుకోవడం కాదు. ఈ కాలంలో యుద్ధం అంటే వాణిజ్యపరంగా జరిగే యుద్ధమే. చైనా మీద ఇదేవిధంగా టారిఫ్‌ల యుద్ధం ప్రకటిస్తే చైనా పోరా కుయ్యా అన్నట్ట్టు అమెరికాను ఖాతరు చేయలేదు. చైనాను అమెరికా భయపెట్టడం కాదు, చైనానే అమెరికాను దారికి వచ్చేట్టు చేసింది. చైనా ఉత్పత్తుల మీద అమెరికా ఆధారపడి ఉంది కానీ అమెరికా మీద చైనా ఆధారపడి లేదు. ఒకటిన్నర దశాబ్దాల కిందట పార్లమెంట్ సభ్యుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లింది. ఓ సమావేశంలో ఈ బృందానికి చేతిలో పట్టుకొనే చిన్న సైజు అమెరికా జాతీయ పతాకం అందజేశారు.
జెండాకున్న చిన్న కర్రపై అక్షరాలు చూసి ఈ బృందం ఆశ్చర్యపోయింది. అమెరికా జాతీయజెండాపై మేడ్ ఇన్ చైనా అని రాసి ఉన్నట్టు ఆ బృందంలో సభ్యునిగా వెళ్లిన అప్పటి రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. అమెరికా జాతీయ జెండా కోసం కూడా చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి. చైనాను బెదిరించాలని అమెరికా చూస్తే రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎగుమతిని నిలిపివేసి చైనానే అమెరికాను దారిలోకి తెచ్చుకున్నది. ప్రస్తుతం అమెరికాను కూడా ఎదిరించే స్థితిలో చైనా ఉంది.
రష్యాతో మన దేశ స్నేహాన్ని కూడా సహించే స్థితిలో అమెరికా లేదు. చైనాతో మన దేశ ప్రధాని ఒకసారి సమావేశమైతేనే అమెరికా అధ్యక్షుడు సహించడం లేదు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఉన్నా, మరో నాయకుడున్నా వారికి అమెరికా ప్రయోజనాలు ముఖ్యం. ట్రంప్ పదవీకాలం ముగిశాక ఇంకో అధ్యక్షుడు వస్తే ఇండియాతో సంబంధాలు బాగుపడతాయి, ఇండియాకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటారనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది.
మన దేశం మాత్రం మనకు మనమే విశ్వగురు అని ప్రచారం చేసుకుంటూ మన భుజాలు మనమే తట్టుకుంటున్నాం. 20 నుంచి 25 ఏండ్ల వయస్సు అత్యంత కీలకమైనది. ఈ కీలక కాలాన్ని యువత యూనివర్సిటీకి ఇస్తే, యూనివర్సిటీ ఆ విద్యార్థికి బదులుగా ఏమిస్తున్నది? అని ఓ సమావేశంలో సివిల్స్‌కు శిక్షణ ఇచ్చే ఖాన్ సార్ ప్రశ్నించారు. మన విద్యావ్యవస్థను నడిపిస్తున్నవారు ఈ ప్రశ్న తమకు తాము వేసుకోవాలి.
‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అంటూ ట్రంప్ విజయం కోసం మోదీ అమెరికాలో ఎన్నికల ప్రచారం చేసి, భారతీయుల ఓట్లు ట్రంప్‌కు పడేట్టు మోదీ చేసినా ట్రంప్ హయాంలోనే భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు అనేక పశ్చిమదేశాల్లో భారతీయులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరోవైపు భారత వలసదారులకు వ్యతిరేకంగా అమెరికా నిర్ణయాలు తీసుకొంటున్నది.
ఈ ప్రభావం అన్నిరంగాల్లో ఉంటుంది. భారత ఐటీరంగంపై, ఫార్మా రంగంపై ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నది. గత రెండు మూడు నెలల నుంచి స్టాక్ మార్కెట్‌పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకే రోజు ఐటీ, ఫార్మా స్టాక్స్ ఇండెక్స్ రెండు శాతం మేరకు పడిపోయాయి. ఈ రెండు రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ రెండు రంగాల నుంచి విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా లభిస్తున్నది. దానిని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ వీటిపైనే గురిపెట్టారు. ఇండియా నుంచి ఐటీ ఎగుమతులు అమెరికాకే ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై టారిఫ్ విధించాలనే ఆలోచనలో అమెరికా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే దేశానికి మరింత నష్టం. అలా అని అమెరికాకు భయపడి అమెరికా నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతికి ద్వారాలు తెరిచి భారత వ్యవసాయరంగాన్ని ప్రమాదంలో పడేయమని కాదు. అధిక జనాభానే మన దేశ అభివృద్ధికి అవరోధంగా మారిందని ఇంతకాలం ప్రజలను నమ్మిస్తూ వచ్చారు. పాశ్చాత్య దేశాలు ఇప్పడు జనాభా తక్కువతో సంక్షోభంలో పడిపోయాయి. అధిక జనాభా అవరోధం కాదు, అనుకూలం అని చైనా నిరూపించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా ఇప్పడు అమెరికాను సైతం తలదన్నేందుకు సిద్ధమవుతున్నది. అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మన దేశం మాత్రం మనకు మనమే విశ్వగురు అని ప్రచారం చేసుకుంటూ మన భుజాలు మనమే తట్టుకుంటున్నాం. ‘20 నుంచి 25 ఏండ్ల వయస్సు అత్యంత కీలకమైనది. ఈ కీలక కాలాన్ని యువత యూనివర్సిటీకి ఇస్తే, యూనివర్సిటీ ఆ విద్యార్థికి బదులుగా ఏమిస్తున్నది?’ అని ఓ సమావేశంలో సివిల్స్‌కు శిక్షణ ఇచ్చే ఖాన్ సార్ ప్రశ్నించారు. మన విద్యావ్యవస్థను నడిపిస్తున్నవారు ఈ ప్రశ్న తమకు తాము వేసుకోవాలి. అక్బర్ ది గ్రేట్ పాఠాలు ఉండాల్సిందే అని ఓ వర్గం, తీసివేయాల్సిందే అని మరో వర్గం వాదులాడుకోవడం వద్దే మన తెలివి ఆగిపోతున్నది.
అంతే కానీ, యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థికి బతుకు పోరాటం కోసం మనం ఏం ఇస్తున్నామనే ఆలోచన లేదు. అమెరికా వెళ్లి పొమ్మంటే కెనడా వెళ్లాలి. కెనడా పంపిస్తే జర్మనీకి వెళ్దామని ఇలా దేశాలు పట్టుకొని తిరగడమే కానీ, సొంత దేశం ఈ యువశక్తికి అవకాశాలు కల్పించడం లేదు. ఓట్ల రాజకీయాల్లో కులం, మతం ఉపయోగపడినట్టుగా ఉపాధి అవకాశాల అంశం ఉపయోగపడదు. అందుకే, రాజకీయపక్షాలు, అధికార పక్షం దృష్టిలో ఇది ప్రాధాన్యతా అంశం కాకుండాపోయింది.
మన ఐటీ నిపుణులు లేకపోతే అమెరికాలో ఒక్క క్షణం గడవదు, మనం లేకపోతే అమెరికా వాడికి బతుకు లేదని మనల్ని మనమే పొగుడుకోవాలి. అమెరికా పెడుతున్న ఆంక్షల వల్ల మనకన్నా అమెరికాకే ఎక్కువ నష్టం కావచ్చు. కానీ, ఆ నష్టాన్ని భరించే స్థితిలో అమెరికా ఉన్నది. ఆ నష్టాన్ని భరించే స్థితిలో మన దేశం లేదు. అమెరికాలో మన ఐటీ ఇంజినీర్లకు అవకాశాలు లేకపోతే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఇంకా దెబ్బతింటుంది, ఇంజినీరింగ్ కాలేజీల పని అయిపోతుంది. నిరుద్యోగం విలయతాండవం ఆడుతుంది. ఈ నష్టాన్ని అమెరికా పూడ్చుకోగలదు. మన దేశం ఈ నష్టాన్ని ఇప్పటికిప్పుడు తట్టుకోలేదు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ఖాళీ అవుతుంది, మా వల్లే బతుకుతుందని తెలంగాణ ఉద్యమకాలంలో వాదించినట్టుగా ఇప్పుడు అమెరికా వ్యవహారంలో వాదిస్తున్నారు.
మనవాళ్లు అమెరికా వెళ్లేది ఇక్కడి కన్నా, ఆ దేశంలో ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని. అంతేకానీ, అమెరికాను అభివృద్ధి చేద్దామని కాదు. కేవలం మత నినాదాలు, కుల సమీకరణలతో విజయం సాధిస్తున్న బీజేపీ మేక్ ఇన్ ఇండియా నినాదానికే పరిమితం కాకుండా మన యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు, మన దేశం అన్ని రంగాల్లో మన కాళ్ల మీద మనం నిలబడేట్టు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఒక రెండు దశాబ్దాల కిందట ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది అనే ప్రచారం బాగా వినిపించేది. గ్లోబలైజేషన్ నుంచి ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశంలో ‘మా దేశంలో మాకే అవకాశాలు’ అని వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలు ప్రాథమిక దశలోనే ఉండవచ్చు, ఇవి ఉధృతమైతే ముందుగా నష్టపోయేది మన దేశమే. గ్లోబ్లో కనిపించే ప్రతి దేశంలో భారతీయులున్నారు. ఈ దేశంలోనే ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలను నమ్ముకోవలసిన అవసరం ఉండదు. పాశ్చాత్య దేశాల్లో భారతీయులకు వ్యతిరేకంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న వలసల వ్యతిరేక ఉద్యమాలపై ప్రభుత్వం దృష్టిసారించాలి.
– బుద్దా మురళి