సికింద్రాబాద్, జనవరి 6: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించి రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని, వెకిలి చేష్టలు మానకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రధాని మోడీ మేకిన్ ఇండియా పాలసీని పక్కన పెట్టి సేల్ ఇండి యా విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. బీజేపీ నేతలు నోరు పారేసుకుంటున్న తీరును ప్రజలు సహ్యించుకుంటున్నారని.. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడే తెలంగాణ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చుకోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్పై అవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది ఏ ప్రభుత్వమో అని విమర్శించారు. రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.