Revanth Reddy | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ) : ‘గచ్చిబౌలి భూమికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధం?’ అని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో డిమాండ్స్‌పై చర్చ సందర్భంగా పలు అంశాలపై సీఎం స్పందించారు. ‘గచ్చిబౌలిలో 25 ఏండ్ల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి ఆ భూమిని కేటాయించారు. 25 ఏండ్ల నుంచి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమి కేటాయింపును రద్దు చేసింది’ అని సీఎం చెప్పారు. తాను వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి భూమిని ప్రభుత్వానికి సాధించిపెట్టినట్టు వివరించారు. ఆ భూమిని ఐటీ కంపెనీలు, పరిశ్రమ కోసం లే అవుట్ చేయాలని సూచించినట్టు వెల్లడించారు.
‘మేము కాంక్రీట్ ప్రపోజల్‌తో ముందుకు వస్తే.. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, అత్యంత అరుదైన జీవరాశులు ఉన్నట్టు చెప్తున్నారు. జింకలు, పులులు లేవు. కొన్ని గుంటనక్కలు చేరి ఇట్ల వ్యవహరిస్తున్నాయి. స్పీకర్ ఆధ్వర్యంలో అవసరమైతే ఎమ్మెల్యేలందరినీ అక్కడికి తీసుకెళ్తాం’ అని సీఎం పేర్కొన్నారు.
కలెక్టర్లను ఎప్పుడంటే అప్పుడు, ఎన్నిసార్లు అయినా బదిలీ చేయవచ్చు కానీ, టీచర్లను బదిలీ చేయడం అంత ఆషామాషీ కాదు. రాష్ట్రంలో 26 వేల సర్కారు బడుల్లో 6.5 లక్షల మంది డ్రాపౌట్ అయ్యారు. విద్యా ప్రమాణాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ప్రపంచంలో 50% సెలవుదినాలు ఉన్న శాఖ విద్యాశాఖనే.
ముఖ్యమంత్రి అయిన తరువాత తాను కాని, తన కుటుంబసభ్యులు కాని ఎక్కడా ఇంచు భూమి కూడా కొనలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. భూ సేకరణ విషయంలో భూములు కోల్పోయిన వారికి ఏం చేద్దామో చెప్పాలని కోరారు. ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ గేమ్స్‌పై కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విషయమై సిట్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ప్రపంచంలో 50% సెలవులున్న శాఖ విద్యాశాఖనే అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవని స్పష్టంచేశారు. బుధవారం శాసనమండలిలో విద్యాశాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో 26 వేల సర్కారు బడుల్లో 6.5 లక్షల మంది డ్రాపౌట్ అయ్యారని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో 8,792 టీచర్ పోస్టులను భర్తీచేసిందని, తాము అధికారంలోకి వచ్చాక పదివేల టీచర్ పోస్టులను భర్తీచేశామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం డేస్కాలర్స్ మీద ఏడాదికి రూ.1.08 లక్షలు ఖర్చు పెట్టినా, విద్యాప్రమాణలు పడిపోవడంపై సమాజం లోతుగా విశ్లేషించాలి. విద్యాశాఖ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. నిధుల కేటాయింపు ఒక్కటే పరిష్కారం కాదు. సామాజిక బాధ్యతే పరిష్కారం.
రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాప్రతినిధులతో కొట్లాడగలను కానీ, టీచర్లతో కొట్లాడే శక్తి తనకింకా రాలేదని సీఎం వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే, లోకల్‌బాడీ ఎన్నికల్లో పోటీచేయాలంటే, వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉండాలన్న నిబంధన పెట్టాలన్న సూచనలొస్తున్నాయి. దీనిపై విస్తృత చర్చ జరగాలి’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ టీచర్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే నిబంధన పెట్టాలని మండలి చైర్మన్ గుత్తా సూచించగా.. ప్రభుత్వ టీచర్లను అనేంత ధైర్యం తనకు లేదని, అందరూ సూచన చేస్తే నిర్ణయం తీసుకుంటానని సీఎం తెలిపారు.
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయులకు గతంలో వేసవిలో వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు శిక్షణ నిర్వహించేవారని, ఇప్పుడు ఆ పద్ధతి లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలిలో ‘తెలంగాణలో విద్య’ అనే అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చైర్మన్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎన్రోల్మెంట్ తగ్గడం ఆందోళనకరమని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తెలిపారు. ప్రభుత్వాలు పాఠశాలలపై దృష్టిపెట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు చెప్పారు. ఎమ్మెల్సీలు రఘోత్తమ్‌రెడ్డి, కోదండరాం, అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడారు.