Funtastic | ‘పూజకు వెళ్లి వచ్చారా? చెవిలో పువ్వులు ఉన్నాయి?’
‘నేనా… పూజా..! హ్హ… హ్హ… మేం రాజకీయాల్లో దేవుళ్లను వాడుకుంటాం కానీ పెద్దగా పూజలు చేయం.’
‘మరి చెవిలో పువ్వు?’
‘ఎదుటి వాళ్ల చెవిలో పెట్టడానికి వాళ్లని నమ్మించాలి. అంటే ముందు మనం పువ్వు పెట్టుకోవాలి అదే ఇది.’
‘ఎన్నికలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు?’
‘తెలంగాణకు మేం చేసిన మేలు వల్ల మా గెలు…’
‘ఆగండాగండి.. తెలంగాణకు మీరు మేలు చేశారా? ఒక్కటి చెప్పండి?’
‘ఒక్కటి కాదు వరుసగా పది చెబుతాను. తెలంగాణ స్వరూపమే మార్చాము, మేలు చేశాం.’
‘నేను అడిగింది.. గుజరాత్‌కు మీ పువ్వు పార్టీ చేసిన మేలు గురించి కాదు. తెలంగాణకు చేసిన మేలు గురించి చెప్పండి?’
‘అదే చెబుతున్నా… తెలంగాణ పురిటి నొప్పుల్లో ఉండగానే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపేశాం. దీనివల్ల తెలంగాణ స్వరూపం మారిందా? లేదా ?’
‘ఇది మేలా?’
‘ఆ ఏడు మండలాలను అభివృద్ధి చేసే బరువు తెలంగాణకు లేకుండా చేశాం కదా…’
‘ఇంకా..?’
‘గతంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కేటాయిస్తే, దాన్ని మేం గుజరాత్‌కు తరలించాం. లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, మూడులక్షల మందికి పరోక్షంగా ఈ ప్రాజెక్ట్ ఉపాధిని కల్పిస్తుంది. అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే హైదరాబాద్‌లో మరో ఐదు లక్షల మంది ఉండేవారు. ఇప్పటికే ట్రాఫిక్ జామ్. ఇంకెంత కష్టంగా ఉండేది.’
‘ఓహో .. ఇంకా?’
‘విశాఖకు స్టీల్ ఫ్యాక్టరీ రాకముందు పచ్చని పొలాలు, గ్రామాలతో చక్కగా ఉండేది. ఫ్యాక్టరీతో విశాఖ మహానగరంగా మారింది. పల్లెలు కనుమరుగు అయ్యాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడితే ఖమ్మం జిల్లా కూడా అలా అయ్యేది. ఆ ప్రమాదాన్ని మేం తప్పించి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అటకెక్కించాం. మేం చేసిన ఈ మేలును మా వాళ్లు సరిగా ప్రచారం చేయడం లేదు. అంతే…’
‘ఇంతేనా?’
‘ఇంతేనా… ఇంకా చాలా ఉంది. శాసన సభ్యులను కొని వాళ్లకు మేలు చేయాలని చూస్తే సీసీ కెమెరాల్లో బంధించి నష్టం చేశారు. శాసనసభ్యులు సంపన్నులు కావద్దా? అలానే ఉండాలా?’
‘నిజమే… ఇంతకీ, మీ పార్టీ నినాదం…’
‘రండి చెవిలో పూలు పెడతాం…’
‘దక్షిణాది వాళ్లు చదువుకున్న వాళ్లు. మా పూలు అక్కడ పూయవు… అని మీ పార్టీ నాయకులే చెప్పినట్టు ఉన్నారు …’
‘అవును ఈ చదువుకున్న వాళ్లతో అదే సమస్య. మా వాట్స్ ఆప్ యూనివర్సిటీ వార్తలు నమ్మరు. చెవిలో పూవులు పెట్టించుకోరు.’
– మురళి