హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): ‘మీ రాష్ట్రంలో నూకలు వస్తే మేమేం చేసుకుంటాం.. మీ ప్రజలకు తినడం అలవాటు చేయండి’ ఇటీవల ఢిల్లీలో యాసంగి ధాన్యం కొనుగోలుచేయాలని కోరడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులతో పీయూష్‌గోయల్ వెకిలిగా అన్న మాటలివి. వెటకారం చేయడంలో ప్రధాని సహా కేంద్రమంత్రులకు సాటిరాగల వాళ్లు లేరు. రైతులను, వాళ్లు పండించే ఉత్పత్తులను అవహేళన చేయాలంటే.. పోటీ పడతారు. కానీ, రైతులకు మేలు చేయాలని కానీ, వాళ్ల ఉత్పత్తులకు ప్రాసెస్ చేసి మార్కెటింగ్ కల్పించడం వంటి చర్యల దగ్గరకు వచ్చేసరికి చేతులెత్తేస్తారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ.. మేకిన్ ఇండియా.. మేడిన్ ఇండియా అని నినాదాలిచ్చే కేంద్ర అమాత్య గణానికి అంతర్జాతీయ మార్కెట్‌పై కనీస అవగాహన కూడా లేదనడానికి ధాన్యం సేకరణపై అనుసరిస్తున్న విధానమే తార్కాణమని చెప్పొచ్చు..
నూకలకు పెరిగిన డిమాండ్
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలరోజులకు పైగా యుద్ధం జరుగుతున్నది. మరోవైపు ప్రపంచంలో ఒక్కసారిగా మొక్కజొన్నల కొరత విపరీతంగా పెరిగిపోయింది. ఉక్రెయిన్ నుంచి మక్కల ఎగుమతి నిలిచిపోయింది. దీంతో మక్కల ధర కూడా భారీగా పెరిగింది. గతంలో మక్కలు క్వింటాలుకు రూ.1,800 ధర పలుకగా, రూ.2,500కు పెరిగింది. ఈ నేపథ్యంలో పశుగ్రాసం కోసం నూకలు (బ్రోకెన్ రైస్) మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ముఖ్యంగా మన దేశంలో వచ్చే నూకలకు భారీ డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా చైనా, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల్లో మన నూకలకు భారీగా డిమాండ్ పెరిగింది. మక్కలను ఆహారంగా వినియోగించుకొంటూ.. నూకలను పశుగ్రాసానికి, ఇతర అవసరాలకు వాడుకొంటున్నాయి. యుద్ధానికి ముందు వరకు క్వింటాలుకు రూ.1,600-1,700 వరకు నూకల ధర పలుకగా ఇప్పుడు రూ.2,100కు పెరిగింది. ఎన్ని నూకలను దిగుమతి చేసుకోవడానికైనా ఈ దేశాలు సంసిద్ధంగా ఉన్నాయి. గత ఏప్రిల్- డిసెంబర్ మధ్య కాలంలో భారత్ నుంచి చైనా 1.1 మిలియన్ టన్నుల నూకలను కొనుక్కొన్నది. వియత్నాం 0.6 మిలియన్ టన్నులు కొనుగోలుచేసింది.
ధాన్యం కొంటే.. ఎగుమతులకు అవకాశం
యాసంగిలో నూకలు ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రం.. ఇందుకు ప్రత్యామ్నాయాలను మాత్రం ఆలోచించడం లేదు. తమకు బాయిల్డ్ రైస్ వద్దంటూ కేవలం రా రైస్ మాత్రమే కావాలంటూ మొండిపట్టు పడుతున్నది. కానీ నూకల ఎగుమతులపై, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌పై కేంద్రానికి గానీ, ఎగుమతులను పర్యవేక్షించే వాణిజ్య, పరిశ్రమలశాఖకు గానీ ఏ మాత్రం అవగాహన ఉన్నా.. ప్రస్తుత పరిస్థితిని సద్వినియోగం చేసుకొనేవాళ్లు. యాసంగిలో తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేసి తద్వారా వచ్చే నూకలను విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. కానీ కేంద్రం ఎగుమతులపై దృష్టి పెట్టకుండా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా మొండిగా వ్యవహరిస్తున్నది. కేంద్రప్రభుత్వం బియ్యం, నూకల ఎగుమతిలో ఘోరంగా విఫలమైంది.