తిరువనంతపురం, మే 6: చాలా ఏండ్ల తర్వాత కేరళలో అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్ కాబోయే సీఎం అభ్యర్థిని ఎంపిక చేయకముందే ఆ పదవికి రేసులో ఉన్న నాయకులు వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ అభిమానులు సామాజిక మాధ్యమం వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ అగ్రనేత రాహుల్ యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో సందేశం పెట్టారు.
ఎన్నికల్లో మంచిగా ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతే కొద్ది నిమిషాల్లోనే వీడీ సతీశనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ కామెంట్ సెక్షన్ వీడీఎస్ మద్దతుదారుల వ్యాఖ్యలతో నిండిపోయింది. వీడీఎస్నే ముఖ్యమంత్రిని చేయాలి, ఈ విషయంలో అధిష్ఠానం ఆటలు ఆడకూడదు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ఆయనే ఆ పదవికి అర్హుడు, పినరయి విజయన్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొన్న సమర్థవంతమైన నేత.. అంటూ వందలాది మంది కామెంట్లు చేశారు.
దీనికి ప్రతిగా, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల అభిమానులు కూడా పెద్దయెత్తున తమ నేతలకు మద్దతుగా సందేశాలు పెట్టారు. ఇది కేవలం కామెంట్లతోనే ఆగిపోలేదు. కొంతమంది అయితే ఏకంగా పార్టీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి బహిరంగ లేఖలే రాశారు. మరికొందరైతే తమ నేతను సీఎంను చేయకపోతే పార్టీ నుంచి నిష్క్రమిస్తామంటూ బెదిరించడం ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియాలో ముగ్గురు నేతల అభిమానులు మూడు వర్గాలుగా చీలిపోయి తీవ్ర మాటల యుద్ధానికి దిగారు. కాగా, దీనిపై రమేశ్ చెన్నితల స్పందిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో నిర్ణయించేది సామాజిక మాధ్యమం కాదని అన్నారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ, అధికారం ఉందని, సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు, ఫ్లెక్సీల ఏర్పాటు ద్వారా నేతల ఎన్నికను ప్రభావితం చేయలేరని, సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించేది అధిష్ఠానం మాత్రమేనని పేర్కొన్నారు.