కేవలం తన మాట వినటం లేదని ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని, అతని కుటుంబాన్ని దారుణంగా హతమార్చాడు అమెరికా అధ్యక్షుడు! తన చెప్పు చేతుల్లో ఉండేవాణ్ణి ఇరాన్‌కు అధ్యక్షుణ్ణి చేయలేదన్న కసితో సవాల్ చేసి మరీ ఇరాన్‌ను తగలబెడుతున్నాడు ట్రంప్. అయినా సరే ఆ గ్లోబల్ రౌడీని అడ్డుకోవడం కాదు కదా కనీసం ప్రశ్నించలేకపోతున్నాయి ప్రపంచ దేశాలు. ఐరాస కూడా కిమ్మనడం లేదు. దీన్నిబట్టి ప్రపంచం ఎంతటి ప్రమాదంలో ఉందో తెలుస్తున్నది.
భారత్‌లో అత్యధిక సంపద అదానీ, అంబానీ, వేదాంత వగైరాల వద్ద పోగుపడినట్టే అమెరికాలోని అత్యధిక సంపద ఆయుధ, ఆయిల్ వ్యాపారుల వద్ద పోగుపడటం తెలిసిందే. ఆ బడా కార్పొరేట్లు రాజకీయాన్ని ’డబ్బుతో అధికారం-అధికారంతో డబ్బు’ అనే చట్రంలో ఇరికించేశారు. ఎలాగంటే తమ ధన ప్రవాహం, మీడియా ప్రచారాలతో తమ లాభాల కోసం పనిచేసే పార్టీ నేతను గెలిపించుకోవడం, వాళ్ల ద్వారా తమ లాభాలను, సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడం.. ఇదే వాళ్లు రూపొందించుకున్న రాజకీయ ఆర్థిక రహదారి.
భారతీయ బడా కార్పొరేట్లు, వాళ్ల చెప్పుచేతల్లోని మీడియాబీజేపీ నాయకుడు మోదీని గెలిపించుకున్నట్టే అమెరికన్ ఆయుధ, ఆయిల్ వ్యాపారులు రిపబ్లికన్ ట్రంప్‌ను గెలిపించుకున్నారు. వాళ్లు అమెరికా అధ్యక్షునికి నిర్దేశించిన కర్తవ్యాలు రెండు. ఒకటి, ఆయుధ వ్యాపారుల ఆయుధాలను విరివిగా అమ్మి పెట్టడం. రెండు, ఆయిల్ వ్యాపారులకు గల్ఫ్ దేశాల నుంచి కారుచౌకగా ఆయిల్ కొనిపెట్టడం.
అందుకే ప్రపంచ దేశాల మధ్య తరచూ యుద్ధాలను ప్రేరేపిస్తూ, ఆ దేశాలకు ఆయుధాలు అమ్మటం అమెరికా అధ్యక్షుని విధుల్లో ఒకటిగా మారింది. ఉదాహరణకు, గతంలో పాక్‌ను భారత్‌పై ఉసిగొల్పి, రెండు దేశాలకూ ఆయుధాలు అమ్మింది అమెరికా. ఇటీవల ఉక్రెయిన్ను రష్యాపైకి, ఇజ్రాయిల్‌ను పాలస్తీనా పైకి ఉసిగొలిపి, ఆ రెండు దేశాలకు అమెరికా భారీగా ఆయుధాలు అమ్మడం తెలిసిందే. అన్య దేశాల యుద్ధాలకు వీలు కానప్పుడు అమెరికా స్వయంగా మరోదేశంపై దాడి చేసి ప్రభుత్వం తరఫున ఆయుధాలను కొంటుంటాడు అమెరికా అధ్యక్షుడు. కేవలం ఆయుధాలకు కొనుగోలు కోసమే అకారణంగా ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికి దిగటమే అందుకు నిలువెత్తు నిదర్శనం. అమెరికన్ ఆయిల్ వ్యాపారుల కోసం మధ్యప్రాచ్య దేశాల నుండి కారు చౌకగా చమురును కొల్లగొట్టేందుకు అమెరికా చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.
ప్రస్తుతం ట్రంప్ లక్ష్యాలు రెండు. ఒకటి, మధ్యప్రాచ్యంలో ప్రవేశానికి ముఖద్వారం వంటి ఇజ్రాయిల్‌ను మరింత బలోపేతం చేసి దానితో పాలస్తీనాను దురాక్రమింపజేసి, గ్రేటర్ ఇజ్రాయిల్ రూ పొందించడం. రెండు, తమ చమురు దోపిడీకి సహకరించని, పరోక్షంగా పాలస్తీనా దురాక్రమణకు అడ్డుపడుతు న్న ఇరాన్‌ను అణచేయడం. ఈ రెండు లక్ష్యాలు నెరవేరితే తమ చమురు దోపిడీకి ఎదురు ఉండదన్నది అమెరికా ఆంతర్యం. ఈ దురుద్దేశం, దురాలోచనలతోనే ఇరాన్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలను లోబరుచుకొని 18 సైనిక స్థావరాలతో పొంచి ఉన్నది అమెరికా.
రష్యా, ఇరాన్‌లు భారత్‌కు చిరకాల, విశ్వసనీయ మిత్రదేశాలు. ఉదాహరణకు, 1) హీరాకుడ్, బాక్రానంగల్ వంటి భారీ ఆనకట్టలకు, భిలాయి, రూర్కెలా ఉక్కు కర్మాగారాలకు ఆర్థిక, సాంకేతిక సాయం అందించిన ఆత్మీయ మిత్ర దేశం రష్యా. 2) బంగ్లాదేశ్ అవతరణ సమయాన పాకిస్థాన్‌కు మద్దతుగా భారత్ పైకి దూసుకొచ్చింది అమెరికా. అప్పుడు భారత్‌కు నేనున్నానంటూ ముందుకొచ్చింది రష్యా. తోకముడిచింది అమెరికా. దటీజ్ రష్యా. 3) అలాగే కాశ్మీర్ విషయంలో ప్రపంచ ముస్లిం దేశాలు పాక్‌కు మద్దతిస్తుంటే కాశ్మీర్ భారత అంతర్భాగం అంటూ ఘంటాపథంగా ప్రకటించిన ఏకైక ముస్లిం దేశం ఇరాన్. 4) క్లిష్ట సమయాల్లో డాలర్లు లేకున్నా రూపాయి మారకానికే భారత్‌కు చమురు అందించిన ఆత్మీయ దేశం ఇరాన్.
జాతీయ నిఘా వ్యవస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీల నేతల రహస్యాలను రికార్డు చేయించటం ద్వారా మోదీ వాళ్లను శాసించగలుగుతున్నట్టే అంతర్జాతీయ నిఘా వ్యవస్థల ద్వారా ఆయా దేశాల రహస్యాలను సమీకరించటం ద్వారా మోదీ వంటి దిగ్గజ నేతలను కూడా నోరు ఎత్తడానికే భయపడేలా చేయగలుగుతున్నారు ట్రంప్, నెతన్యాహూలు. అంతేకాదు తమకు కొరుకుడు పడని ఏ దేశాధినేతనైనా వాళ్ల స్వదేశంలోనే హతమార్చ గలిగే భయంకర విధ్వంసకారులయ్యారు ట్రంప్ నెతన్యాహూలు. అయితే ఈ పాపము కేవలం వాళ్లదే కాదు. వాళ్లని అలాంటి అనివార్య దుస్థితికి నెట్టేసిన ఆయుధ, ఆయిల్ బడా కార్పొరేట్లది కూడా. అభినవ ముసోలిని, హిట్లర్‌లా వ్యవహరిస్తున్న నెతన్యాహూ, ట్రంప్‌లు భీకర విధ్వంసాలకు పాల్పడుతూ ప్రపంచ ప్రజల చేత ద్వేషింపబడుతున్నారు. ఈ అనివార్య దుస్థితికి నెట్టివేయబడటం వెనుక ఉన్న హెచ్చరిక ఒకటే. దేశాధినేతలు ధనాన్ని కొద్ది మంది వద్ద కేంద్రీకరించే కార్పొరేటీకరణ దిశగా పాలన కొనసాగించడం సరికాదు. అలా చేస్తే బడా కార్పొరేట్లు అకారణ యుద్ధాలకు, విధ్వంసాలకు పాల్పడక తప్పని దుస్థితికి దేశాన్ని నెట్టేస్తారు.
-తూరి వెంకటేశ్వరరావు
98490 81889