ఇచ్చోడ, మార్చి 28 : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ శాఖ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఈ మేరకు 33 జిల్లాల్లో 16 వేల పోస్టులను భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది. వచ్చే నెలలో పోలీస్ ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశం ఉండడంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదిలాబాద్, ఉట్నూర్ డివిజన్లలో పోలీస్ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కాగా, ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. బోథ్, బజార్హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, సిరికొండ మండలాల నుంచి యువతీయువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. వచ్చే నెల ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, 5వ తేదీన శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తున్నది.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఉచిత శిక్షణపై నిరుద్యోగ యువత ఆసక్తి చూపుతున్నది. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించేందుకు ముందుకు సాగుతున్నది. పెద్ద సంఖ్యలో స్పందన రావడంతో పోలీస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో అనువజ్ఞుల సలహాలు, సూచనలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న సుమారు 350 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించారు. ఠాణాల్లో దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఉద్యోగ అర్హతలున్న అభ్యర్థుల దరఖాస్తులనే స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా శిక్షణ, అభ్యర్థులకు ఇచ్చే మెటీరియల్, బోధనా నిపుణులు, శిక్షణ కాలం, శారీరక సామర్థ్య పరీక్షలు తదితర అంశాలపై పోలీస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఎస్పీ ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. ఇందుకు నిరుద్యోగ యువత ఆసక్తి చూపుతున్నది. ఇచ్చోడ, బోథ్ సర్కిల్ పరిధిలోని యువకుల నుంచి ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 5 నుంచి రెండు నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. ఇచ్చోడ బస్టాండ్ నుంచి శిక్షణ కేంద్రం వరకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పిస్తున్నాం. నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలి.
– ముదావత్ నైలు, సీఐ, బోథ్