మహబూబ్నగర్ : మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో
4 నామినేషన్లు ఆమోదం పొందగా 6 తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు వెల్లడించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఇ. శ్రీధర్, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావు నామినేషన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల (2) పదవుల ఎన్నికకు గాను మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 4 నామినేషన్లు ఆమోదించగా.. తక్కిన 6 గురి నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఆమోదించిన నామినేషన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నామినేషన్ లతోపాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులవి ఉన్నట్లు తెలిపారు. అవి ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి కావలి శ్రీశైలం, నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కొండ్రావు పల్లికి చెందిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సుధాకర్ రెడ్డి నామినేషన్లు కూడా ఉన్నాయి.
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సార బాయి కృష్ణ, షేక్ రహీం పాషా, మహ్మద్ గౌస్, సంద రేణుక, బెజ్జం మల్లికార్జునరావు, మంతటి రామాంజనేయులు నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి చంద్రారెడ్డి, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి డి. వేణుగోపాల్, గద్వాల జిల్లా అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి రఘురామ శర్మ, నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్,సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ ఆర్ డి ఓ మరియు సహాయ రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి, మహబూబ్ నగర్ ఆర్టీవో పద్మశ్రీ ,నాగర్ కర్నూల్ ఇన్చార్జి జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.