రాంనగర్ (కరీంనగర్), జనవరి 30: మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ప్రభుత్వం చెప్తున్నా కొందరు తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. అతిగారాబంతో వాహనాలు చేతికివ్వడం వల్ల వారు అడ్డగోలుగా నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. కరీంనగర్లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమే ఇందుకు తాజా ఉదాహరణ. స్నేహితులతో కలిసి కారు నడిపిన ఓ బాలుడు అతివేగంతో వెళ్తూ రోడ్డు పక్కన మహిళలపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ కమాన్ నుంచి కోతిరాంపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన బైర కమ్మర కులస్థులు కొన్నేండ్లుగా కుల వృత్తి చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కొడవండ్లు, గొడ్డలి, గడ్డపార వంటి పరికరాలను తయారుచేసి విక్రయిస్తుంటారు. వారాంతాల్లో గొర్రెలు, మేకల కాళ్లు, తలకాయలు కాల్చి ఉపాధి పొందుతుంటారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు కొలిమి వెలిగించిన మహిళలు పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో కమాన్ వైపు నుంచి ఓ బాలుడు నడుపుతున్న కారు అతివేగంగా వీరిపైకి దూసుకొచ్చింది.
ప్రమాదంలో పవార్ సునీత (30), పవార్ లలిత (26), పెరియార్ అలియాస్ స్వప్న (36), సోలంకి జ్యోతి (15) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సోలంకి పద్మ, సోలంకి రాణి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు మైనర్లు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాల రోదనలతో ప్రభుత్వ దవాఖాన పరిసరాలు హృదయవిదారకంగా మారాయి. విషయం తెలుసుకొన్న మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ విచారం వ్యక్తంచేశారు.
మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కారు యజమాని కచ్చకాయల రాజేంద్రప్రసాద్‌తోపాటు కారులోని ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొన్నట్టు కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు.ప్రమాద సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నదని సమాచారం. ఆ కారుపై 9 అతివేగం చలానాలు ఉన్నట్టు తెలిసింది.
ఆటో-బైక్ ఢీ.. ముగ్గురి దుర్మరణం
మల్యాల, జనవరి 30: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం వద్ద ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఆటో-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. నూకపల్లి శివారులో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పను ల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన గోపాల్ సంతా మి, సుధాకర్ సాహు, సురేశ్, హర్షత్ఖంద్, బుత్తద్హిందో పనిచేస్తున్నారు. ఆదివారం నిత్యావసరాలు తీసుకొని జగిత్యాల నుంచి నూకపల్లికి ఆటోలో బయల్దేరారు. మల్యాలకు చెందిన బత్తిని సంజీవ్, కాలికంటి మధు బైక్‌పై జగిత్యాల వైపు వెళ్తుండగా రాజారాం శివారులో ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న బత్తిని సంజీవ్ (25)తోపాటు ఆటోలో ఉన్న గోపాల్ సంతామి (46), సుధాకర్ సాహులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి తీవ్రగాయాలయ్యాయి.