ఆత్మకూర్.ఎస్, జనవరి 05 : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం గట్టికల్లు గ్రామంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న, సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, గట్టికల్లు గ్రామ సర్పంచ్ భయ్యా లింగయ్య, ఉప సర్పంచ్ సందాల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ మడ్డి వెంకన్న, గుండు రమేశ్ మాట్లాడుతూ.. శ్రీరామ్ సాగర్ రెండవ దశ సాధన ప్రదాత, తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు, ఎంసీపీఐయూ పోలిట్ బ్యూరో సభ్యుడు, అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి చిన్నతనంలోనే ఎర్రజెండా చేతబట్టి ప్రజా ఉద్యమాలకు ప్రాణం పోశారన్నారు. దొరల గడీల మీద యుద్ధం చేసి అట్టడుగు వర్గాలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన ఘనత బీఎన్దేనని కొనియాడారు.
ఆనాడు సాయుధ పోరాటంలో తుపాకి పట్టి ముందు కదిలితే శత్రువుల గుండెలు గుబిల్లు మన్నాయని, మోదుగు చెట్లకు బులెట్లు పూయించిన ఎర్రజెండా ముద్దుబిడ్డ భీమిరెడ్డి అన్నారు. వారి త్యాగం వృథా కాకుండా భావితరాలకు ఆదర్శంగా ఉండేందుకు బీఎన్ నిలువెత్తు విగ్రహాన్ని పోరాటాల పురిటిగడ్డ గట్టికల్లు గ్రామంలో నెలకొల్పుతున్నటలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరపాక ఉగ్రయ్య, బచ్చు కోటయ్య, వార్డు మెంబర్లు మురపాక విష్ణు, బచ్చలకూరి సాయి, గ్రామ నాయకులు రాచకొండ సైదులు, మడ్డి శ్రీను, అయోధ్య, చందాల నాగార్జున, శ్రీరాములమ్మ, పూలమ్మ పాల్గొన్నారు.

Atmakur.S : గట్టికల్లు గ్రామంలో బీఎన్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన