Susan Wojcicki | న్యూఢిల్లీ, ఆగస్టు 10: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ కన్నుమూశారు. 56 ఏండ్ల సుసాన్ గత రెండేండ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఇంటర్నెట్ను రూపొందించడంలో, గూగుల్ చరిత్రలో ఆమె విశేష పాత్ర పోషించారు. 1990లో గూగుల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన సుసాన్ యూట్యూబ్ సీఈవోగా 2014 నుంచి 2023 వరకు పనిచేశారు. గూగుల్ చరిత్రలో వోజ్కికీ అతి ప్రధానమైన వ్యక్తని, ఆమె లేని లోకాన్ని ఊహించడం కష్టంగా ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు.
లైంగిక సామర్థ్యం లేదని వివాహం రద్దు
ముంబై: ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): తన భర్తకు శృంగార(లైంగిక) సామర్థ్యం లేక తనతో శారీరకంగా కలవలేకపోతున్నాడని పేర్కొంటూ ఓ యువతి బాంబే హైకోర్టును ఆశ్రయించగా, ఆ వివాహాన్ని కోర్టు రద్దు చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన యువకుడు, ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన యువతికి మార్చి 13న వివాహం జరిగింది. మొదటి రాత్రి, హనీమూన్‌లో యువకుడు యువతిలో శృంగారంలో పాల్గొనకపోవడంతో యువతి మనస్తాపం చెందింది. ఇదేమని ప్రశ్నిస్తే.. శృంగారం తన వల్ల కాదని.. తనను వదిలేయాలని యువకుడు వేడుకున్నాడు. దీంతో యువతి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు వీరి వివాహాన్ని రద్దు చేసింది.
వయనాడ్ బాధితులకు తగిన సాయం: మోదీ
వయనాడ్: కేరళలోని వయనాడ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, బాధితులకు పునరావాసంపై కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు ఆర్థిక సాయం, పునరావాసం విషయంలో కేంద్రం తగిన సాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.