న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి అందులో నివసిస్తున్న ఆయన, ప్రస్తుతానికి చాతర్పూర్లోని ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలకు చెందిన ఎస్టేట్‌లోకి మారారు. ప్రభుత్వ బంగ్లా కేటాయించే వరకు ఆయన అక్కడే ఉంటారని తెలిసింది. ఉప రాష్ట్రపతి నివాస భవనాన్ని ఖాళీ చేసే ముందు అక్కడి సిబ్బంది, అధికారులకు ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాలోకి ధన్‌ఖడ్ మారేందుకు మరో నెల రోజులు పడుతుందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. పార్లమెంట్ కాంప్లెక్స్ ఆనుకొని ఉన్న నార్త్ బ్లాక్ వెనుక ఉప రాష్ట్రపతి కోసం కొత్తగా నిర్మించిన ఎస్టేట్‌లో ధన్‌ఖడ్ ఇప్పటివరకు నివసించారు. అయితే ఆయన జూలై 21న హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారిక నివాస భవనం వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌ను ఆయన ఖాళీ చేయాల్సి వచ్చింది.