Donald Trump | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): మరో ఐదు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న వేళ రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో వివాహేతర సంబంధం, దానిపై నోరు విప్పకుండా ఉండేందుకు ఆమెకు ముడుపులు ముట్టజెప్పిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. ట్రంప్‌పై నమోదైన 34 అభియోగాలు నిరూపణ అయినట్టు న్యూయార్క్ కోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆయన్ని దోషిగా నిర్ధారించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. జూలై 11న ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేయనున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది.
ఏమిటీ కేసు?
స్టార్మీ డేనియల్ (45) ఓ పోర్న్ స్టార్. 2006లో ట్రంప్‌తో తాను శృంగారంలో పాల్గొన్నట్టు ఆమె ఇటీవల కోర్టులో తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై తాను నోరు విప్పకుండా ట్రంప్ 1,30,000 డాలర్లు ముట్టజెప్పారని వెల్లడించారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ట్రంప్ డేనియల్ కోసం ఖర్చు చేశారని, లెక్కల్లో తప్పులు బయటపడకుండా బిజినెస్ రికార్డులన్నింటినీ ఆయన తారుమారు చేశారని ప్రత్యర్థులు ఆరోపించారు.
జైలుకెళ్లాల్సిందేనా?
ట్రంప్‌పై ప్రధానంగా ఉన్న అభియోగం అక్రమ సంబంధం, బిజినెస్ రికార్డులు తారుమారు చేయడం. అయితే, అమెరికాలో ఈ రెండు నేరాలను తక్కువ తీవ్రత గల నేరాలుగానే పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అక్రమ సంబంధం వ్యక్తిగత వ్యవహారమైనప్పటికీ, రికార్డుల తారుమారుకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకూ జైలు శిక్ష ఉంటుందని అంటున్నారు. అయితే ఏ శిక్ష వేయాలన్నది పూర్తిగా న్యాయమూర్తి విచక్షణ మీదనే ఉంటుందని గుర్తుచేస్తున్నారు. కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని పేర్కొంటున్నారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని, ట్రంప్‌నకు జైలు శిక్షకు బదులుగా జరిమానా విధించవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు.
ఎన్నికల్లో పోటీ సంగతేంటీ?
తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని న్యాయనిపుణులు తెలిపారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధనేమీ లేదని వెల్లడించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పోటీలో ఉండాలంటే కనీసం 35 ఏండ్ల వయసు నిండి, 14 ఏండ్లకు పైగా అమెరికాలో నివసిస్తూ పౌరసత్వం కలిగి ఉంటే సరిపోతుందని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ, ట్రంప్ జైలుకు వెళ్లినప్పటికీ, అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రచారం చేసుకోవచ్చని, గెలిస్తే ప్రమాణం కూడా అక్కడి నుంచి చేసుకొనే వెసులుబాటు ఉన్నట్టు పేర్కొంటున్నారు. 1920లో సోషలిస్ట్ నేత యూజీన్ విక్టర్ డెబ్స్ జైలులో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశారని కొందరు గుర్తుచేశారు. తాజాగా ట్రంప్ సైతం యథావిధిగా ప్రచారం కొనసాగించొచ్చని వెల్లడించారు.
కోర్టు తీర్పుపై ట్రంప్ ఏమన్నారంటే?
కోర్టు తీర్పుపై ట్రంప్ స్పందించారు. తాను అమాయకుడినని పేర్కొన్నారు. అవినీతిపరుడైన ఒక వివాదాస్పద న్యాయమూర్తి జరిపిన విచారణ అనంతరం వచ్చిన ఈ తీర్పు అవమానకరమైనదేనని మండిపడ్డారు. నిజమైన తీర్పు నవంబర్ 5 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలిస్తారని వ్యాఖ్యానించారు.