నర్సింహులపేట అక్టోబర్ 6 : రైతుల కష్టకాలంలో ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూరియా ఒక్కటే కాంగ్రెస్ను ఓడిస్తుందని మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు మైదం దేవేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్యా నాయక్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు.సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదని ఆరోపించారు.
శాసనసభ ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ అభివృద్ధి కోసం బడ్జెట్లో 20 కోట్లు కేటాయిస్తామని ఎన్నికల తీర్మానం చేసి ఆ ఊసే మరిచారని దుయ్యాబట్టారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు జిఓ ద్వారా ఇచ్చి ఎన్నికలకు వెళితే రాష్ట్రపతి, కేంద్రానికి తీర్మానం ఎందుకు పంపారని, ఇది తెలివి తక్కువ తనానికి నిదర్శనమని అన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎంపీపీ జడ్పీటీసీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని తెలిపారు.
యూరియా కోసం పొద్దుగూకల నుండి తెల్లవారుజాము వరకు భార్యాభర్తలు జాగారం చేయాల్సిన పరిస్థితి దాపురించాయని, మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఓటు అడికేందుకు గ్రామాల్లోకి వెళితే మహిళలు చీపురు కట్టతొ కొట్టే రోజులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జాటో దేవేందర్, మధుసూదన్ రెడ్డి, సువీర్ రెడ్డి, రవి నరసింహారెడ్డి, ఖాజామియా, వెంకన్న, కిషన్ నాయక్, శీను, రామన్న, నర్సయ్య, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.