మేడ్చల్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హిల్ట్ పాలసీ ముసుగులో ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన మేడ్చల్ పారిశ్రామికవాడలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి పర్యటించారు. అనంతరం హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ పేరిట ప్రభుత్వ భూములను తెగనమ్ముతూ, దేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ తెర లేపుతున్నదని మండిపడ్డారు. వెంటనే ప్రభు త్వం హిల్ట్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పరిశ్రమల భూముల ధర ఒక్కో ఎకరం కనీసం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు ఉంటుందని చెప్పారు. కానీ, రిజిస్ట్రేషన్ ధరలో 30% చెల్లిస్తే రెగ్యులరైజ్ చేయడమంటే కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే ప్రయత్నమేనని ఆరోపించారు. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభు త్వం చేసిందేమీలేదని విమర్శించారు. అదృష్టం కొద్దీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పాలనపై అవగాహన లేకపోవడంతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధీ జరగడం లేదని చెప్పారు.
పరిశ్రమల భూములు అమ్మి కార్మికులను రోడ్డున పడేస్తరా? అని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 20, 30 ఏండ్లుగా పరిశ్రమల్లో పనిచేస్తూ మేడ్చల్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కార్మికుల కుటుంబాలు స్థిరపడ్డాయని, ఇప్పుడు పరిశ్రమలను తరలిస్తే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. అమ్ముతున్న పరిశ్రమల భూముల్లో 20 శాతాన్ని కార్మికుల కుటుంబాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కార్మికులను కడుపులో పెట్టి చూసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల బతుకులను రోడ్డున పడేస్తున్నదని దుయ్యబట్టారు. కార్మికులంతా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రియల్ఎస్టేట్ బ్రోకర్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యహరిస్తున్నదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆరోపించారు. గతంలో యూనివర్సిటీ భూములు అమ్ముకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తుచేశారు. ఇప్పుడు పరిశ్రమల భూములతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామికరంగాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని విమర్శించారు. పరిశ్రమల సంఖ్య పెంచాల్సిందిపోయి రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం పరిశ్రమల భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాస్కర్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, దయానంద్‌యాదవ్, రాజమల్లారెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా జరిగిన ధర్నా నినాదాలతో దద్దరిలింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు.