రవీంద్రభారతి, డిసెంబర్ 4 : జనవరి 11న వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో లక్ష మందితో ఓసీ సింహగర్జన మహాసభ నిర్వహించనున్నట్టు ఓసీ జేఏసీ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి తెలిపారు. గురువారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన సభ పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కొందరు అసత్యప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఓసీలంతా ఐక్యమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీచేయాలని డిమాండ్ చేశారు.