జడ్చర్ల, మే 9 : కడుపు మండిన మక్క రైతులు కన్నెర్ర చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం ఆందోళనకు దిగారు. గంగాపూర్ సమీపంలోని జడ్చర్ల-కల్వకుర్తి హైవేపై పత్తి మార్కెట్ వద్ద 3 గంటలపాటు బైఠాయించారు. ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలను కాంటా వేసిన అధికారులు ఎత్తకపోవడంతో 40 వేల బస్తాలు మార్కెట్లోనే ఉండిపోయాయని వాపోయారు.
బ్యాగుల కొరతతోపాటు గోదాముల్లో స్థలం లేక మార్కెట్లోనే ఉంచిన మక్కజొన్న బస్తాల వద్ద నిత్యం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మార్క్‌ఫెడ్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు రైతులకు నచ్చజెప్పే యత్నం చేసినా విన్పించుకోలేదు. కలెక్టర్, ఎమ్మెల్యే రావాలని పట్టుబట్టారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రైతులకు మద్దతుగా బైఠాయించారు. మార్క్‌ఫెడ్, పీఏసీఎస్ అధికారులు, తహసీల్దార్‌తో మాట్లాడారు. ఐదురోజుల కిందట మార్కెట్‌కు వచ్చిన మక్కలను కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు అధికారులు దిగిరావడంతో ఆందోళన విరమించారు.