చందంపేట(దేవరకొండ), మే 9 : యాసంగి ధాన్యం కొనుగోళ్లను 15 రోజుల్లో ముగించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో వివిధ మండలాల తాసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసినట్లు తెలిపారు. మిగిలిన ధాన్యం కొనుగోళ్లను 15 రోజులోల పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని మిల్లర్లను సమన్వయం చేస్తూ ధాన్యం వేగంగా మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపడతామన్నారు.
రైతులు తెచ్చిన ధాన్యం కల్లాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని, ఇప్పటి వరకు రూ.487 కోట్ల చెల్లించామని తెలిపారు. డివిజన్ పరిధిలో 12 మిల్లులకు చెందిన మిల్లర్లు ధాన్యం సేకరణలో సహకరించాలని కోరారు. లారీల సంఖ్య పెంచడంతో పాటు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలూ నాయక్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, దేవరకొండ ఇన్చార్జ్ ఆర్డీవో రమణారెడ్డి, డీఎస్వో వెంకటేష్, డీఎం రాంపతి నాయక్, డీసీవో పత్యనాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, తాసీల్దార్లు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్‌బాబు, డీటీ ముబీన్, వెంకటయ్యగౌడ్, రంగయ్య, మున్నయ్య యాదవ్ పాల్గొన్నారు.