సారంగాపూర్, జూలై 9: ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో నాయకులు, మహిళలతో కలిసి అంగన్వాడీ భవనం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 22లో 15 ఏండ్ల కింద అంగన్వాడీ భవనాన్ని లెంటల్ లెవల్ దాకా నిర్మించారని, దీనికి హౌస్ నంబర్ 3-96 ఇచ్చారని తెలిపారు.
అయితే, కొన్ని కారణాలతో నిర్మాణం నిలిచిపోయిందన్నారు. అయితే, సదరు సర్వే నంబర్‌ను ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 21ని ఆధారంగా చేసుకుని అంగన్వాడీ టీచర్ బోగ లత భర్త, బీపీఎంగా పనిచేసే సత్తయ్య భవనాన్ని ఆక్రమించారని ఆరోపించారు. భవనంలో అక్రమంగా బెల్ట్ షాపు, కిరాణషాపు అమ్మకాలు చేస్తున్నారని బీర్పూర్ తహసీల్దార్ గతేడాది డీపీవోకు ఫిర్యాదు చేయగా, ఆయన విచారించి అంగన్వాడీ భవనాన్ని తొలగించాలని ఆర్డర్ ఇచ్చారని వివరించారు. ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గత ఆదివారం గ్రామస్తులే స్వయంగా వెళ్లి అక్రమ నిర్మాణాన్ని తొలగించారని వివరించారు. గ్రామస్తులు కూలగొట్టిన సమయంలో ఎస్ఐ ఆక్రమణదారుడికి అండగా నిలిచి నలుగురు గ్రామస్తులపై దాడిచేయడం సరికాదన్నారు.
ఆక్రమణదారులకు అండగా నిలిస్తే ఎస్ఐపైనా క్రిమినల్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అని, పోలీస్ శాఖ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు మద్దతు తెలుపాలి కానీ, ఆక్రమణదారులకు అనుగుణంగా పనిచేయడం సరికాదన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌కు, దీనికి ఏం సంబంధం ఉంటుందని, మిస్‌గైడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొల్ముల రమణ, ముక్క శంకర్, చెరుపూరి సుభాస్, రిక్కల ప్రభాకర్, గుడిసే జితేందర్ యాదవ్, ఆడెపు తిరుపతి, రంగు మల్లేశం, ఆయా గ్రామాల నాయకులు, నర్సింహులపల్లి గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.