హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువువయ్యాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఏడాది కాలంలో హైదరాబాద్‌లో 35,944 నేరాల కేసులు నమోదు కావడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతున్నదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి దృశ్యాలను పోస్ట్ చేశారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతుండడం వల్ల ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో శాంతిభద్రతలు లేవనే విషయం స్పష్టమవుతున్నదని ఎద్దేవా చేశారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా అడుగంటుతున్న శాంతిభద్రతలపై తక్షణం చర్యలు తీసుకుని, ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టాలని డిమాండ్ చేశారు.