మోర్తాడ్, మే 12: పొక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను సిట్ విచారణ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. భగీరథ్‌పై నమోదైన పొక్సో కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వేముల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడని అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
ఓ బాలికకు డ్రగ్స్, మద్యం ఇచ్చి లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నా, పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నదని ఆరోపించారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. పోక్సో చట్టం ప్రకారం బాలిక చెప్పేది వేదమని పేర్కొన్నారు. అటువంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి, నిందితుడు ఆమెపైనే తిరిగి ‘హనీట్రాప్’ పేరుతో కేసు పెట్టడం దారుణమని, మైనర్ హనీట్రాప్ చేస్తుందా అని ప్రశ్నించారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్‌రెడ్డి, బండిసంజయ్ ఒక్కటేనని అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
వారిద్దరిది ఫెవికాల్ బంధం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌ది ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారని, కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే కేంద్రమంత్రి కొడుకుపై ఇంత పెద్ద నేరం మోపబడినా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం, కేటీఆర్, హరీశ్‌రావుపై విషం చిమ్మే బండి సంజయ్ తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసే సంజయ్, ఇప్పుడు తన కొడుకుపై వచ్చిన పోక్సో కేసుకు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ కేసులో రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, బాధితురాలు, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులు ఇప్పటికైనా ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాన్ని గౌరవించాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ తాము పోరాడుతామని వేముల స్పష్టం చేశారు.