హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ) : దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30తో పీఆర్సీ గడువు ముగుస్తున్నందున సీఎం రేవంత్చొరవ తీసుకుని నివేదిక తెప్పించుకోకపోతే మరో ఏడాది గడిచినా ఉద్యోగులకు పీఆర్సీ అందదని ఆందోళన వ్యక్తంచేశారు. గడువు పొడిగిస్తూ పోతే ఉద్యోగులు రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అధ్యయన కమిటీ వేస్తామని చెప్పడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లోని రూ.10 వేల కోట్లు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై స్పష్టత లేకపోవడంతో వారు రోడ్డున పడే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆదాయంలో సగం ఉద్యోగులకే పోతున్నదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఖజానా నుంచి ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తున్నది 38 శాతమేనని దేవీప్రసాద్ స్పష్టంచేశారు. ఉద్యోగులను చులకన చేసేలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్‌కార్డులను దవాఖానలు పట్టించుకోవడం లేదని, ఓపీ సేవలను వెల్నెస్ సెంటర్లకు అప్పగించి ఒక నిమ్స్ దవాఖానకే పరిమితం చేయడం దారుణమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రస్తావిస్తూ.. గతంలో కమిటీలు 29 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేస్తే కేసీఆర్ ఏకంగా 43 శాతం ఇచ్చారని గుర్తుచేశారు. సమావేశంలో ఎస్టీఎఫ్ మాజీ అధ్యక్షుడు భుజంగరావు, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ పాల్గొన్నారు.