పోచారం అభయారణ్యం, వన విజ్ఞానకేంద్రాన్ని సందర్శించిన యూడీఏఐడీ బృందం
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్/హవేళీ ఘనపూర్: తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉన్నదని అమెరికాకు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ (యూడీఏఐడీ) ప్రశంసించింది. సోమవారం యూడీఏఐడీ బృందం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అర్బన్‌పార్కు, హవేళీ ఘనపూర్ మండలంలోని పోచారం అభయారణ్యం, వన విజ్ఞానకేంద్రాన్ని సందర్శించింది. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, మొక్కల పెంపకం, హరితహారం తదితర కార్యక్రమాల గురించి స్థానిక అధికారులు వారికి వివరించారు. నర్సాపూర్ అర్బన్‌పార్కులో పెరిగిన మొక్కలను చూసి, అద్భుతంగా ఉన్నదని కితాబిచ్చారు. హరితహారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులను పీసీసీఎఫ్(కంపా) లోకేశ్‌జైశ్వాల్, సీసీఎఫ్ శర్వానన్ ఫొటోఎగ్జిబిషన్ ద్వారా బృందానికి వివరించారు. అనంతరం వాచ్‌టవర్ పైనుంచి అటవీ అందాలను తిలకించారు. పార్కులోని సీతాఫలాల రుచిచూశారు. పోచారం అభయారణ్యం, వనవిజ్ఞాన కేంద్రం నిర్వహణను ప్రశంసించారు. ఈ బృందంలో యూడీఏఐడీ డిప్యూటీ అసిస్టెంట్ అంజనీకౌర్, మిషన్ డైరెక్టర్ ఇండియా వీణారెడ్డి, సీనియర్ ఫారెస్ట్ అడ్వైజర్ వర్గీస్పాల్, ప్రోగ్రామ్ ఆఫీసర్ అలైన్ లీ ఉన్నారు.