హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ములుగులోని అటవీ కశాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో నాలుగేండ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసిన 2017 బ్యాచ్ బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ విద్యార్థులకు శుక్రవారం పట్టాలు ప్రదానం చేశారు. ఈ ఉత్సవానికి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, ఓయూ రిజిస్ట్రార్ పీ లక్ష్మీనారాయణ, ఉద్యాన వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ నీరజా ప్రభాకర్, ఫారెస్ట్ కాలేజ్ డీన్ ప్రియాంక వర్గీస్ హాజరయ్యారు.
మొత్తం 48 మంది విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది విద్యార్థులకు ప్రత్యేక ప్రతిభ పురస్కారాలను అందజేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ బంగారు పతకాన్ని పాటిల్ జోత్స్న అందుకొన్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్ఎం డోబ్రియల్, ఫారెస్ట్ కార్పొరేషన్ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు అక్బర్, సునీతా భగవత్, రిటైర్డ్ ఉన్నతాధికారులు బీపీ ఆచార్య, పీకే ఝా, మనోరంజన్ ఖాజా, డిప్యూటీ డైరెక్టర్లు సుతాన్, నర్సింహారెడ్డి, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.